Tollywood ReRelease Movies : సెకండ్ రిలీజ్ సూపర్ హిట్! టాలీవుడ్‌లో పవన్, మహేశ్ ల మ్యాజిక్
Tollywood ReRelease Movies : ఎన్ని కోట్లు పెట్టి సినిమా తీశామన్నది కాదు.. ఎంత బాగా ఆడిందన్నదే ముఖ్యం. ఫస్ట్ డే ఫస్ట్ షోతోనే అర్థమైపోతుంది ఆ సినిమా రిజల్ట్;
Tollywood ReRelease Movies : ఎన్ని కోట్లు పెట్టి సినిమా తీశామన్నది కాదు.. ఎంత బాగా ఆడిందన్నదే ముఖ్యం. ఫస్ట్ డే ఫస్ట్ షోతోనే అర్థమైపోతుంది ఆ సినిమా రిజల్ట్. 30 కోట్లు పెట్టి తీసినా, 300 కోట్లు పెట్టి తీసినా కథలో పస ఉండి, జనాల మూడ్ బావుంటే హిట్ చేస్తారు.. లేదంటే అంతే సంగతులు. నిన్న మొన్న వచ్చిన సీతా రామం, బింబిసార, కార్తికేయ 2 తక్కువ బడ్జెట్ చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. హిట్ టాక్‌తో దూసుకుపోతున్నాయి. సౌత్, నార్త్ ఎక్కడైనా ఇదే పరిస్థితి.
టాలీవుడ్ స్థాయి బాలీవుడ్ వరకు చేరినా అన్ని సినిమాలు హిట్ కాకపోవడం కొన్ని భారీ సినిమాలు కూడా అట్టర్ ఫ్లాప్ కావడంతో ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పుడు అభిమాన దేవుళ్లే నష్టపోతున్న టాలీవుడ్‌ను ఆదుకోబోతున్నారా అని అనిపిస్తుంది. ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీలో తెలుగు ప్రేక్షకులకు ఉన్న సినిమా ప్రేమ పిచ్చి అందరికంటే ఎక్కువ. ఇప్పుడు దీన్నే క్యాష్ చేసుకోవడానికి సినీ పెద్దలు రెడీ అయ్యారు.
ఇటీవల మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా 2006లో రిలీజ్ అయిన పోకిరి సినిమాను మళ్లీ 4కె, డాల్బీ ఆట్మాస్ సౌండ్ మిక్స్ చేసి థియేటర్లో రీరిలీజ్ చేశారు. మహేష్ బాబు అభిమానులు మాత్రమే కాకుండా అనేక మంది థియేటర్లకు వచ్చి ఎంజాయ్ చేశారు. సినీ పెద్దల ఈ ఐడియా కొంత వర్కవుట్ అయినట్లు కనిపించింది. ఇప్పుడు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ మూవీ 'జల్సా'ను ఆయన పుట్టినరోజు సెప్టెంబర్ 2న రీరిలీజ్ చేయనున్నారు. పవన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ కలెక్షన్లు, హౌస్‌ఫుల్ బోర్డులు అన్ని టాప్ సినిమాలకు పడనున్నాయా వేచి చూడాల్సిందే.