Vidudala 2 Review : విజయ్ సేతుపతి విడుదల 2 మూవీ రివ్యూ

Update: 2024-12-20 10:34 GMT

రివ్యూ : విడుదల 2

తారాగణం : విజయ్ సేతుపతి, సూరి, మంజు వారియర్, రాజీవ్ మీనన్, గౌతమ్ మీనన్ తదితరులు

ఎడిటింగ్ : ఆర్ రామర్

సంగీతం : ఇళయ రాజా

సినిమాటోగ్రఫీ : ఆర్ వేల్ రాజా

నిర్మాతలు : ఎల్రేడ్ కుమార్, వెట్రి మారన్

దర్శకత్వం : వెట్రిమారన్

ప్రతి దర్శకుడికీ ఓ స్టైల్ ఉంటుంది. కొందరు దర్శకుల స్టైల్ కు మిగతా అంతా ఫిదా అవుతుంటారు. తీసే ప్రతి సినిమాతో తన భావజాలాన్ని చెప్పడం.. ఓ స్టేట్మెంట్ వదలడం అనేది అత్యంత అరుదుగా ఉంటుంది. అలాంటి అరుదైన దర్శకుడే వెట్రి మారన్. కాంటెంపరరీ ఇష్యూస్, ఇష్యూస్ బేస్డ్, ఇన్ ఈక్వాలిటీ, వివక్ష వంటి అంశాలు ప్రధానంగా కనిపించినా.. కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాడు. ఇంటెన్సిటీతో కూడిన డ్రామాస్ తో మెస్మరైజ్ చేస్తుంటాడు వెట్రి మారన్. అలా అతను రూపొందించిన విడుదల 1 మూవీ 2023లో రిలీజ్ అయ్యి సంచలన విజయం సాధించింది. దానికి కొనసాగింపుగా వచ్చిన విుడదల 2 ఇవాళ రిలీజ్ అయింది. మరి ఈ సీక్వెల్ ఎలా ఉందో చూద్దాం.

కథ :

పెరుమాళ్ ( విజయ్ సేతుపతి )ని అరెస్ట్ చేసిన పోలీస్ లు బేస్ క్యాంప్ లో ఉంచి టార్చర్ చేస్తుంటారు. అతను అక్కడే ఉంటే ప్రమాదం అని రాత్రికి రాత్రే అడవిలో ఉండే మరో క్యాంప్ కు తరలించే ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయాణంలో అసలు పెరుమాళ్ ఎవరు అనేది అతనే చెబుతూ వస్తుంటాడు. పెరుమాళ్ యంగ్ ఏజ్ లో ఉండగా ఓ గ్రామంలో టీచర్ గా పనిచేస్తుంటాడు. ఆ ఊరి జమిందార్ కొత్తగా పెళ్లైన అమ్మాయి మొదటి రాత్రి తనతో గడపాలి అనే దురాచారాన్ని ఎదిరించిన ఓ కుర్రాడు ఆ జమిందార్ ను చంపేస్తాడు. దానికి ప్రతీకారంగా అతని కొడుకు ఆ ఊరిపై పడి అందరినీ చిత్ర హింసలు పెడతాడు. పెరుమాళ్ ఆ కుర్రాడిని దాచి పోలీస్ లకు అప్పజెబితే కోర్ట్ లో శిక్ష పడుతుంది. ప్రాణాపాయం తప్పుతుంది అనుకుంటాడు. కానీ పోలీస్ లు జమిందార్ కు చెబుతారు. అతను ఆ కుర్రాడితో పాటు అతని భార్యనూ చంపేస్తారు. ఆక్రమంలో పెరుమాళ్ ను కూడా పొడిచేస్తారు. చావు బతుకుల్లో ఉన్న పెరుమాళ్ ను ఓ కమ్యూనిస్ట్ నాయకుడు వచ్చి కాపాడతాడు. తర్వాత తన భావజాలాన్ని పెరుమాళ్ కు అందిస్తాడు. అలా అతనితో కలిసి సమాజంలో అసమానతలపై పోరాటం చేస్తున్న పెరుమాళ్ ఓ దశలో సామ్యవాదం కావాలంటే తీవ్రవాదం కావాల్సిందే అని అప్పుడే కొత్తగా వస్తోన్న అతివాద కమ్యూనిస్ట్(నక్సలైట్స్) లతో కలిసి ప్రజాదళం పేరుతో కొత్త గ్రూప్ స్టార్ట్ చేసి ఆయుధాలతోనే కొత్త ప్రజాస్వామ్యం పుడుతుంది అని పోరాటం మొదలుపెడతాడు. ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న ఇబ్బందులు, సాధించిన విజయాలు, తన మార్గాన్ని విస్తరించడం.. ఈ క్రమంలో పోలీస్ లకు వార్నింగ్ ఇవ్వడం కోసం రైల్వే బ్రిడ్జ్ పై బాంబ్ పెట్టడం.. దాని కారణంగా చాలామంది ప్రాణాలు కోల్పోవడం.. వీటి కారణంగా అతన్ని అతి పెద్ద తీవ్రవాదిగా చూసిన ప్రభుత్వం అరెస్ట్ చేయించడం వరకూ సాగుతుంది. మరి అరెస్ట్ అయిన పెరుమాళ్ ను పోలీస్ లు ఏం చేశారు.. అనేది ఊహించేదే అయినా.. ఈ కథను ఇలా చెప్పడం అనేది వెట్రిమారన్ ధైర్యానికి నిదర్శనం. కమ్యూనిజం కోణంలో ఇంత డీటెయిల్డ్ గా వచ్చిన సినిమా ఇండియాలో మరోటి లేదు అనే చెప్పాలి.

వందేళ్ల క్రితం ఇండియాలో మొదలైన కమ్యూనిస్ట్ పార్టీ.. 60ల్లో రెండు వర్గాలుగా చీలిపోయింది. ఆ తర్వాత అతివాద, మితవాద గ్రూపులుగా మారింది. ఆ మారిన వైనాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు వెట్రిమారన్. ఇలాంటి విప్లవకారులపై ప్రభుత్వం వైఖరి ఎలా ఉంటుంది.. పోలీస్ ల తీరు ఎంత దారుణంగా ఉంటుంది అనే అంశాలను ధైర్యంగా చెప్పాడు. విప్లవకారుల కుటుంబ జీవితాలను కళ్లకు కట్టినట్టు చూపించాడు. వారి త్యాగాలకు గుర్తింపు లేకుండా చేయడానికి పోలీస్ లు, ప్రభుత్వం ఎంతటి నీచత్వానికైనా తెగబడతారు అనేది క్లియర్ గా చూపించాడు.

అప్పటి వరకూ తుపాకీతోనే కొత్త రాజ్యం వస్తుందని నమ్మిన పెరుమాళ్ తను అప్పటి వరకూ నమ్మింది తప్పు అని అర్థమయ్యేలా చేసిన బ్లాస్టింగ్ సీన్, క్లైమాక్స్ లో పోలీస్ లకు లొంగిపోయే ముందు తన తోటి కామ్రేడ్( ఈ పదాన్ని సినిమాలో మిత్రమా అని మార్చారు)తో మాట్లాడిన సిద్ధాంత పరమైన సందేశమే ఈ సినిమాకు అత్యంత కీలకం.

కొన్ని సన్నివేశాలు చూస్తే వెట్రిమారన్ ఎంత డీప్ గా స్టడీ చేస్తే ఇంత గొప్ప స్క్రీన్ ప్లే రాసుకుని ఉంటాడు అనిపిస్తుంది. సమాజాన్ని ఎంత చదివి ఉంటే ఇంత వేదన తెలిసి ఉంటుంది అనిపిస్తుంది. అణచివేతలపై, సాంఘిక అసమానతలపై నిత్యం పోరాటం చేస్తోన్న కమ్యూనిస్టులు, వారి ఉద్యమాలు, జీవితాల గురించి ఇంత గొప్పగా రూపొందించిన సినిమా ఇప్పటి వరకూ రాలేదు అంటే అతిశయోక్తి కాదు.

నటన పరంగా పెరుమాళ్ పాత్రలో విజయ్ సేతుపతి జీవించాడు. అతనిలోని గొప్ప నటుడుని మరోసారి చూస్తాం. సూరిని ఈ పార్ట్ లో పూర్తిగా పక్కనపెట్టినా.. ప్రీ క్లైమాక్స్ నుంచి మళ్లీ అతని ట్రాక్ స్టార్ట్ అవుతుంది. అతని ద్వారా విడుదల 3కి ఇచ్చిన లీడ్ బావుంది. మంజు వారియర్ మరోసారి మెస్మరైజ్ చేసింది. రాజీవ్ మీనన్, గౌతమ్ మీనన్ నటన బావుంది. రాఘవేందర్ అనే పాత్రలో నటించిన నటుడూ అదరగొట్టాడు. సింపుల్ గా చెబితే తెరపై నటులు కనిపించరు.. అన్నీ పాత్రలే ఉంటాయి. అందరూ అంత సహజంగా నటించారు.

టెక్నికల్ గా సినిమాటోగ్రఫీ హైలెట్ గా ఉంది. బ్రిలియంట్ వర్క్ కనిపిస్తుంది. చాలా కష్టపడినట్టూ తెలుస్తుంది. ఇళయరాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడా డల్ అయినా ఓవరాల్ గా బావుంది. పాటలూ బావున్నాయి. ఈసినిమాకు ప్రధాన కంప్లైంట్ నిడివి. కాస్త ట్రిమ్ చేసి ఉంటే బావుండు అనిపిస్తుంది. తెలుగు డైలాగ్స్ బావున్నాయి. డబ్బింగూ బావుంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే. దర్శకుడుగా వెట్రి మారన్ బెస్ట్ వర్క్ ఇది. చాలా డీప్ స్టడీతో రూపొందించాడు. వ్యక్తులు, సిద్ధాంతాలు, ప్రభుత్వాలు, పోరాటాలు, ప్రజల జీవన స్థితిగతులు.. ఇవన్నీ చాలా సహజంగా చూపిస్తూ ఎవరి పక్షమూ వహించకుండా ప్రజలకు ఎలా మేలు చేయాలో చెప్పే ప్రయత్నంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు.

ఫైనల్ గా : విడుదల 2.. కమ్యూనిస్ట్ లపై వెట్రి మారన్ ఓపెన్ స్టేట్మెంట్

రేటింగ్ : 3/5

- బాబురావు. కామళ్ల

Full View

Tags:    

Similar News