భారీ బడ్జెట్ సినిమాలు బ్లాక్ బస్టర్ అయినా వచ్చే లాభాలు ఆ స్థాయిలో కనిపించవు అంటారు. కానీ ఒక చిన్న సినిమా బ్లాక్ బస్టర్ అయితే ప్రాఫిట్స్ కళ్లు చెదిరేలా ఉంటాయి. తెలుగులో మినిమం బడ్జెట్ తో వచ్చిన బేబీ వంద కోట్లు కొల్లగొట్టింది. ఇది సాలిడ్ హిట్ అంటే. అలాగే కన్నడ నుంచి వచ్చిన కాంతార 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి ఏకంగా 350 కోట్ల వరకూ సాధించింది. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనే మాటకు అర్థం ఈ సినిమా కలెక్షన్స్. ఇక రీసెంట్ గా తమిళ్ నుంచి వచ్చిన ఓ చిన్న బడ్జెట్ సినిమా మహారాజ మూవీ కూడా కేవలం 20 కోట్ల బడ్జెట్ తో రూపొందింది. ఈ మూవీ కూడా ఏకంగా 110 కోట్ల వరకూ వసూళ్లు సాధించి సిసలైన బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.
మహరాజలో భారీ సెట్టింగ్ లు లేవు. స్టార్ కాస్టింగ్ లేదు. కాకపోతే మమతా మోహన్ దాస్, అనురాగ్ కశ్యప్, అభిరామిలతో కూడి ఉన్న నటులంతా హైలీ టాలెంటెడ్. డ్యూయొట్స్ ఉండవు. అసలు హీరోయిన్నే లేదు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో ఉండే ఫార్ములా ఒక్కటీ లేదు. అయినా వంద కోట్లు వసూళ్లు దాటిందంటే కారణం కంటెంట్ మాత్రమే. బలమైన కంటెంట్ ఉంటే కాసులు రావడం పెద్ద కష్టమేం కాదు అనేందుకు కొన్నాళ్లుగా అన్ని భాషల్లోనూ చిన్న సినిమాలే ప్రూవ్ చేస్తున్నాయి. ఆ కోవలోనే ఈ మూవీ మహారాజ కూడా నిలిచింది.
మొత్తంగా విజయ్ సేతుపతి కెరీర్ అంతా బలమైన కంటెంట్ ఉన్న కథలే ఎంచుకుంటున్నాడు. ఆరంభం నుంచీ అదే చేస్తున్నాడు. అదే అతన్ని ‘స్టార్ యాక్టర్’ను చేసింది. ఆ కారణంగానే ఇప్పుడు సౌత్ లో మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్ గా ఎదిగాడు విజయ్ సేతుపతి.