ఆగస్ట్ నెల కూడా టాలీవుడ్ కు షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకూ వచ్చిన సినిమాల్లో కమిటీ కుర్రోళ్లు, ఆయ్ మూవీస్ మాత్రమే ఓకే అనిపించుకున్నాయి. మిగతా అన్నీ డిజాస్టర్స్ గా తేలాయి. ముఖ్యంగా ఆగస్ట్ 15న విడుదలైన మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ మూవీస్ ఊహించని విధంగా ఆల్ టైమ్ డిజాస్టర్స్ అనిపించుకున్నాయి. దీంతో ఇక లాస్ట్ వీక్ లో వచ్చే నాని సరిపోదా శనివారం పైనే అంచనాలున్నాయి. అయితే చిన్న సినిమాలు మెప్పిస్తున్నాయి కాబట్టి ఈ గ్యాప్ లో వస్తోన్న మూవీస్ గురించి ఆరా తీస్తున్నారు. అంటే ఈ నెల 23న వస్తోన్న సినిమాలు కూడా చిన్నవే.
23న విడుదల కాబోతోన్న మూవీస్ లో ఎక్కువగా అట్రాక్ట్ చేస్తోన్న మూవీ 'మారుతి నగర్ సుబ్రహ్మణ్యం'. రావు రమేష్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్ నిర్మించింది. అంతకు ముందు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు కానీ.. ట్రైలర్ తర్వాత అందరి అటెన్షన్ ఈ మూవీపైకి వెళ్లింది. బలమైన కంటెంట్ తోనే రూపొందిన సినిమా అని అర్థం అయింది. ముఖ్యంగా రావు రమేష్ టాలెంట్ కు చాలా రోజుల తర్వాత వందశాతం పని దొరికిందనే కమెంట్స్ వస్తున్నాయి. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ లా కనిపిస్తోన్న మారుతి నగర్ సుబ్రహ్మణ్యం మోస్ట్ ప్రామిసింగ్ గా కనిపిస్తోంది.
రేవు అనే మరో చిన్న సినిమా కూడా బరిలో ఉంది. ఎవరూ తెలిసిన మొహాలు కాదు. కానీ ట్రైలర్ మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇంకాస్త బలమైన ప్రమోషన్స్ చేసుకుని ఉంటే ఖచ్చితంగా ఎక్కువ రీచ్ వచ్చే సినిమాలా కనిపిస్తోందీ ట్రైలర్ చూస్తే.
దీంతో పాటు డీమోంటీ కాలని 2 అనే డబ్బింగ్ సినిమా కూడా వస్తోంది. ఫస్ట్ పార్ట్ కు తెలుగులోనూ మంచి ఆదరణ వచ్చింది. రీసెంట్ గా విడుదలైన ఈ తమిళ్ మూవీకి అక్కడ మంచి రివ్యూస్ వచ్చాయి. ఈ నెల 23న తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. హారర్ బ్యాక్ డ్రాప్ లో సరికొత్తగా కనిపిస్తోంది. మరి ఈ మూడు సినిమాలతో పాటు మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ మూవీ ఇంద్ర రీ రిలీజ్ అవుతోంది. కాకపోతే ఈ మూవీ 22న మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా విడుదలవుతోంది. ఇప్పటికైతే అందరి చూపూ ఇంద్రపైనే ఉంది. ఈ మూడు సినిమాలు కంటెంట్స్ తో ప్రూవ్ చేసుకోవాలిక.