విష్ణు మంచు టైటిల్ పాత్రలో నటిస్తూ నిర్మించిన సినిమా కన్నప్ప. ఈ నెల 27న విడుదల కాబోతోన్న ఈ చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేశాడు. అత్యంత భారీ బడ్జెట్ తో పాటు భారీ తారాగణం కూడా ఉందీ సినిమాలో. పైగా వీళ్లంతా ఆయా భాషల్లో టాప్ స్టార్స్ కావడం విశేషం. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి స్టార్ కాస్టింగ్ ఉంది. ఎక్కువ భాగాన్ని న్యూజీలాండ్ లో చిత్రీకరించారు. ఆ కారణంగానే బడ్జెట్ డబుల్ అయిందంటున్నారు. ఇక రిలీజ్ టైమ్ దగ్గరవుతున్నా.. ఈ మూవీకి ఊహించిన స్థాయిలో బజ్ క్రియేట్ కాలేదు అనేది నిజం. అందుకు ప్రధాన కారణం మంచు ఫ్యామిలీ పై సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్. వాటికి చెక్ పెట్టేలా.. ఇది దేవుడికి, భక్తికి సంబంధించి సినిమా కాబట్టి ఎవరూ ట్రోల్ చేయొద్దంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బ్రహ్మానందం స్పీచ్ హైలెట్ అయింది.
ఇక ఈమూవీపై నమ్మకంతో విష్ణు ఇప్పటి వరకూ ఓటిటి డీల్స్ సెట్ చేసుకోలేదు. అయితే ఓపెనింగ్స్ పరంగా చూస్తే విష్ణుకు అంత రేంజ్ లేదు. మోహన్ బాబు ఎప్పుడో ఫేడవుట్ అయిపోయాడు. సో.. ఇక ఓపెనింగ్స్ మొత్తం ప్రభాస్ ను చూసే వస్తాయని ఖచ్చితంగా చెప్పొచ్చు. కానీ అతను హీరో కాదు. ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. ఈ పాత్ర నిడివి పావుగంటకు పైనే ఉంటుందని కూడా చెప్పారు. అది కూడా ఇంటర్వెల్ తర్వాత వచ్చే పాత్ర. ముందుగా అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి వారు కనిపిస్తారు. కానీ అక్షయ్ రోల్ కూడా పరిమితమే అనేది క్లియర్ గా తేలిపోయింది. సో.. ఈ మూవీకి ఎలాంటి ఓపెనింగ్స్ వచ్చినా అది కేవలం ప్రభాస్ ను చూసే వస్తాయనుకోవచ్చు. నిజానికి ట్రైలర్ తో పాటు ఈ మూవీ ఇంటర్వ్యూ కంటెంట్ కట్స్ లో కూడా కామెంట్స్ అన్నీ ప్రభాస్ కోసమే అన్నట్టుగా ఉన్నాయి తప్ప.. విష్ణు కోసమో, మోహన్ బాబు కోసమో లేక కన్నప్ప కోసమో అని ఎవరూ చెప్పడం లేదు. అయినా హీరో విష్ణు కాబట్టి ఆ క్రెడిట్ ను తన అకౌంట్ లోనే వేసుకుంటాడేమో.