మోస్ట్ టాలెంటెడ్ స్టార్ సూర్య నటించిన రెట్రో మూవీ ఈ గురువారం విడుదలవుతోంది. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటించింది. కొన్నాళ్లుగా సూర్యకు సరైన థియేట్రికల్ హిట్ లేదు. అంతకు ముందు ఆకాశం నీ హద్దురా, జై భీమ్ లాంటి మూవీస్ హిట్ అయినా అవి ఓటిటి బొమ్మలు. థియేటర్స్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టే ఏళ్లవుతోంది. ఈ విషయంలో ఫ్యాన్స్ కూడా కొంత అసంతృప్తిగా ఉన్నారు. పైగా ప్రయోగాలు ఎక్కువ చేయడం కూడా వారికి నచ్చడం లేదు. చివరగా వచ్చిన కంగువా అయితే ఓ రకంగా అభాసుపాలైంది అనే చెప్పాలి. అసలు ఏం చెప్పాలనుకున్నారో ఈ మూవీతో అనేది కూడా తెలియలేదు. ఎవ్వరికీ అర్థం కాలేదు. ఒక్క సూర్య మొహం తప్ప ఇంకెవరి ఫేస్ లూ సరిగా కనిపించలేదు కూడా. వస్తోన్న విమర్శలను సీరియస్ గా తీసుకున్నాడేమో.. అందుకే రెట్రోతో మరోసారి తనదైన మాస్ కంటెంట్ తో వస్తున్నాడు.
రెట్రోతో సూర్య ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన సిట్యుయేషన్ లో ఉన్నాడు. ఓ సాలిడ్ బ్లాక్ బస్టర్ పడితే కానీ ఇమేజ్ నిలవదు. అఫ్ కోర్స్ ఆఫర్స్ తగ్గవు. కానీ ఇంత టాలెంట్ ఉండి కూడా సినిమాలు పోతుంటే ఎవరికైనా బాధే కదా. పైగా వరుసగా సినిమాలు చేస్తున్నాడిప్పుడు. తను పంథా మార్చాడు కాబట్టి.. రెట్రోతో హిట్ కొడితే రాబోయే వాడివాసలై తో పాటు తెలుగులో చేయబోయే చిత్రానికీ పెద్ద హెల్ప్ అవుతుంది. లేదూ రిజల్ట్ మారకపోతే మాత్రం ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ ల బిజినెస్ పై ప్రభావం పడుతుంది. ఏదేమైనా ఈ మూవీతో సూర్య ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిందే అనేలా ఉంది సిట్యుయేషన్.
నిజానికి ట్రైలర్ చూస్తే కథ ఇదీ అనే ఫీలింగ్ కలగలేదు. కాకపోతే కార్తీక్ సుబ్బరాజ్ మూవీస్ అలాగే ఉంటాయి. అతను డైరెక్ట్ గా వెండితెరపైనే అసలు బొమ్మ చూపిస్తాడు. అతని స్క్రీన్ ప్లే బావుంటుంది. హీరోల క్యారెక్టరైజేషన్ కూడా కొత్తగా ఉంటుంది. వీటికి తోడు బలమైన కథ కూడా ఉంటే రెట్రోతో సూర్య ఈ సారి బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం అనుకోవచ్చు.