తమిళ్ హీరోలకు తెలుగులో మార్కెట్ క్రియేట్ చేసుకోవడం చాలా సులువు. కాస్త మంచి కథాబలం ఉన్న సినిమాను తెలుగులో డబ్ చేస్తే చాలు.. మనోళ్లు వెంటనే ఓన్ చేసుకుంటారు. బట్ మన హీరోలను మాత్రం అక్కడి జనం అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు. ఈ మధ్య కాలంలో తెలుగులో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకుంటున్నాడు శివకార్తికేయన్. ఎస్కేఎన్ అని ఫ్యాన్స్ అభిమానంగా పిలుచుకునే ఇతను తెలుగులోనూ ఇంపాక్ట్ చూపిస్తున్నాడు. ఆ మధ్య అనుదీప్ డైరెక్షన్ లో ప్రిన్స్ అనే మూవీ కూడా చేశాడు. ఇక ఈ నెల 5న శివకార్తికేయన్ నటించిన మదరాసీ తెలుగులోనూ విడుదల కాబోతోంది.
ఏఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేసిన సినిమా మదరాసీ. రుక్మిణి వసంత్ హీరోయిన్. అనిరుధ్ సంగీతం అందించాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ పవర్ ఫుల్ గా ఉంది. గతంలో శివకార్తికేయన్ తెలుగులో అమరన్ మూవీతో అద్భుతమైన విజయం అందుకున్నాడు. కోలీవుడ్ లో టైర్ 2 హీరోగా ఉన్న అతను ఇక్కడ ఏకంగా 35 కోట్లకు పైగా కొల్లగొట్టాడు అమరన్ మూవీతో. ఆ మూవీతో ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా బాగా దగ్గరయ్యాడు. దీంతో మదసారీ పై అంచనాలున్నాయి. కాకపోతే మురుగదాస్ ఇప్పుడు అస్సలు ఫామ్ లో లేడు. తెలుగులో మహేష్ బాబుతో చేసిన స్పైడర్ డిజాస్టర్ అయింది. రీసెంట్ గా హిందీలో సల్మాన్ ఖాన్ తో చేసిన సికందర్ సైతం డిజాస్టర్. అయితే ట్రైలర్ ఓ రకంగా ఆకట్టుకుంది. తుపాకీ తర్వాత ఇప్పటి వరకూ ఏ సినిమాలోనూ విలన్ గా చేయని విద్యుత్ జామ్వాల్ ఈ మూవీ కోసం విలన్ గా చేయడానికి ఒప్పుకున్నాడు. అతని మార్షల్ ఆర్ట్స్ విన్యాసాలు ఒళ్లు గగుర్పొడిచేలా కనిపిస్తున్నాయి.
ట్రైలర్ ను బట్టి ఇది కూడా టెర్రరిస్ట్స్ అటాక్స్ కు సంబంధించిన కథ అని తెలుస్తోంది. హీరోయిన్ కోసం కామ్ గా ఉన్న హీరో.. టెర్రరిస్ట్ ల దాడిలో ఆమె చనిపోతే (లేక గాయాలతో ఉంటే) వారిపై పగ తీర్చుకోవడం అనే కాన్సెప్ట్ లా కనిపిస్తున్నా.. ఇన్ డెప్త్ గా ఇంకేదో మేటర్ ఉన్నట్టుగానే ఉంది. మొత్తంగా శివకార్తికేయన్ ఈ మూవీతో అమరన్ రిజల్ట్ ను రిపీట్ చేస్తే ఇక తెలుగులో పాగా వేసినట్టే. లేదూ మురుగదాస్ ఫామ్ కంటిన్యూ అయితే ఫ్లాప్ పడినట్టే.