Raja Saab Movie : ఈ సంక్రాంతి నవ్వులతో నిండిపోతుందా..?

Update: 2026-01-06 09:50 GMT

సాధారణంగా సంక్రాంతి అంటే భారీ యాక్షన్ డ్రామాలు, ఫ్యాక్షన్ కథలు లేదా సెంటిమెంట్ సినిమాల మధ్య పోటీ ఉంటుంది. కానీ ఈ ఏడాది సీన్ పూర్తిగా మారిపోయింది. టాలీవుడ్ అగ్ర హీరోల నుంచి యంగ్ స్టార్స్ వరకు అందరూ ఈ పండగకి కామెడీనే ఆయుధంగా చేసుకున్నారు. జనవరిలో థియేటర్లన్నీ వినోదపు వెల్లువతో కళకళలాడనున్నాయి.

ముందుగా సంక్రాంతి బరిలో వస్తోన్న చిత్రం ‘ది రాజాసాబ్‘. యాక్షన్ ఇమేజ్‌ను పక్కన పెట్టి రెబెల్ స్టార్ ప్రభాస్ తొలిసారి హారర్ కామెడీ జోనర్‌లో ‘ది రాజాసాబ్’తో ఈ నెల 9న వచ్చేస్తున్నాడు. దర్శకుడు మారుతి తనదైన శైలిలో ప్రభాస్‌లోని కామెడీ టైమింగ్‌ను ఎలా వాడుకున్నాడో చూడాలని ఫ్యాన్స్ ఆత్రుతగా ఉన్నారు. సంక్రాంతి రేసులో మొదటగా వస్తున్న పెద్ద సినిమా ఇదే. ఇక మెగాస్టార్ చిరంజీవి తన మార్క్ వింటేజ్ కామెడీతో ‘మన శంకర వరప్రసాద్ గారు‘గా ప్రేక్షకులను పలకరించనున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. దీనికి తోడు విక్టరీ వెంకటేష్ కూడా తోడవడంతో ఈ చిత్రం డబుల్ డోస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ గ్యారెంటీ ఇస్తోంది.

ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ అయిన రవితేజ.. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అంటూ రాబోతున్నాడు. ఈ టైటిల్‌లోనే ఎంతో ఫన్ దాగుందని అర్థమవుతోంది. రవితేజ ఎనర్జీకి కిషోర్ తిరుమల రైటింగ్ తోడవ్వడం ఈ సినిమాకు ప్రధాన బలం. రవితేజ మార్క్ కామెడీకి ఎలాంటి ఢోకా ఉండదని ట్రైలర్ చూస్తేనే అర్ధమవుతుంది. జనవరి 13న రిలీజ్ కాబోతున్న ఈ మూవీతో కమ్ బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు మాస్ రాజా. ఇక.. వినోదానికి బ్రాండ్ అంబాసిడర్ లా ఉండే నవీన్ పోలిశెట్టి చాలా కాలం తర్వాత ‘అనగనగా ఒక రాజు’ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నవీన్ కి జోడీగా మీనాక్షి నటించింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి వస్తోన్న ఈ చిత్రం యూత్ ను, ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తోంది. జనవరి 14న రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమాపై కూడా అంచానాలు భారీగా ఉన్నాయి.

సంక్రాంతి పందెంలో చివరగా వస్తున్న చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. 'సామజవరగమన' ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా నటించిన ఈ సినిమాలో శ్రీవిష్ణు అతిథి పాత్రలో మెరవనున్నాడు. క్లీన్ రొమాంటిక్ కామెడీగా ఈ చిత్రం సిద్ధమైంది. జనవరి 14న ప్రీమియర్స్ తో మొదలుకానున్న ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. మొత్తానికి ఈ సంక్రాంతికి రక్తం చిందించే గొడవలు, భారీ డైలాగుల కంటే.. హాయిగా నవ్వుకునే కథలకే పీట వేశారు మన మేకర్స్. మరి ఈ ఐదు సినిమాల్లో బాక్సాఫీస్ వద్ద ఏ హీరో 'కామెడీ' కింగ్ గా నిలుస్తారో వేచి చూడాలి!

Tags:    

Similar News