కాన్సెప్ట్ బేస్డ్ కథలు తగ్గిపోతున్నాయి తెలుగులో. అప్పుడప్పుడూ వస్తున్నా.. సరైన ప్రమోషన్స్ లేక కొన్ని.. విషయం వీక్ గా ఉండి కొన్ని ఆడియన్స్ కు దూరం అవుతున్నాయి. అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో రూపొందిన ‘పరదా’ చిత్రం కూడా ఈ తరహా కథలానే కనిపిస్తోంది. పవన్ కండ్రేగుల డైరెక్ట్ చేసిన ఈ మూవీ నుంచి తాజాగా ఓ లిరికల్ సాంగ్ విడుదలైంది. వనమాలి రాసిన ఈ గీతాన్ని అనురాగ్ కులకర్ణి పాడాడు. అనురాగ్ పాడాడు అంటే తెలుసు కదా.. పాట హిట్ అని. ఈ పాట వినగానే అదే అనిపిస్తుంది అందరికీ. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు.
యత్ర నార్యస్తు పూజ్యంతే.. రమంతే తత్ర దేవతాః అనే శ్లోకంతో ప్రారంభమైన పాట.. స్త్రీ గొప్పదనాన్ని చాటుతూ సాగుతుంది. వనమాలి సాహిత్యం అక్షరమక్షరం ఆకట్టుకునేలా ఉంది. ‘మగువే మగువే ఆకాశంలో సగం హిమవన్నగం.. మగువే మగువే ఓ ప్రేమసాగరం ఇలకే వరం.. మానవజాతికి పురుడు పోసిన బ్రహ్మరా.. ప్రణమిల్లరా.. అమృతమూర్తిగా అవతరించిన అమ్మరా.. అపరంజిరా.. ’పల్లవితోనే మగువల గొప్పదనాన్ని సింపుల్ గా ఆవిష్కరించాడు రచయిత వనమాలి. పురాణాల్లోని దేవతా మూర్తులను ప్రేరణగా తీసుకుని రాసిన చరణాలు గొప్పగా ఉన్నాయి.
ఓ సాంఘిక దురాచారం చుట్టూ సాగే కథలా ఉంది ఈ పరదా మూవీ. అనుపమతో పాటు దర్శన, సంగీత, రాగ్ మయూర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ ఆగస్ట్ 22న సినిమాను విడుదల చేస్తున్నట్టు ఈ పాట విడుదల కార్యక్రమంలో ప్రకటించారు మేకర్స్. తెలుగుతో పాటు మళయాలంలోనూ అదే డేట్ లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రంతో అనుపమ ఎలాంటి ప్రశంసలు అందుకుంటుందో చూడాలి.