Satya Dev : బ్రహ్మాజీ ఓవరాక్షన్.. బెడిసికొట్టిన ప్రమోషన్

Update: 2024-11-16 08:30 GMT

ఏదైనా అతిగా అనిపిస్తే అసహ్యంగా మారుతుంది. ఎంత బాండింగ్ కొద్దీ మాట్లాడుకుంటున్నా.. అది పబ్లిక్ ప్లాట్ ఫామ్ లో ఉన్నప్పుడు కాస్త నోరు అదుపులోనే ఉండాలి. అది స్క్రిప్టెడ్ కావొచ్చు, ఇంటర్నల్ గా వాళ్ల స్కెచ్ లు ఏమైనా ఉండొచ్చు. బయటకు వచ్చిన దాని గురించే జనం మాట్లాడుకుంటారు. అలా ప్రస్తుతం టాలీవుడ్ లో చాలా సీనియర్ మోస్ట్ నటుడు బ్రహ్మాజీ నోటి.. దూ.. తో చేసిన ఓవరాక్షన్ గురించి మాట్లాడుకుంటున్నారు. బ్రహ్మాజీలో మంచి కామెడీ సెన్స్ ఉంది. టైమింగ్ ఉంది. దాన్ని వాడే టైమ్ ను బట్టి టైమింగ్ నవ్విస్తుందా లేక చిరాకు తెప్పిస్తుందా అనేది తెలుస్తుంది. తాజాగా సత్యదేవ్ హీరోగా నటించిన జీబ్రా అనే మూవీ ప్రమోషన్స్ కోసం బ్రహ్మాజీని వాడుకున్నారు. కానీ ఈ ప్రోమోలో వారి మధ్య సంభాషణ సినిమాకు ఉపయోగపడకపోగా.. అభాసుపాలయ్యేలా చేసింది.

ప్రోమోలో రావడం రావడమే చాలా చిరాకుగా ఎంట్రీ ఇచ్చిన బ్రహ్మాజీ.. సత్యదేవ్ పై అరుస్తుంటాడు. ‘నువ్వు.. నువ్వు డ్యాన్సు,, హుక్కా బొక్కా, జీబ్రా అంటే థియేటర్ కు జనం పొలోమని వచ్చేస్తారా.. చెప్పాలంటే మీ సినిమా గురించి ఎవడికీ తెలియదు.. నీ య.. గోల..., కేజీఎఫ్, సలార్ రవి బస్రూర్ సంగీతం అంటే వెటకారంగా మాట్లాడాడు. హీరోయిన్లే నీ ప్రమోషన్స్ కు రావడం లేదు.. ముందు నువ్వు కళ్లజోడు తీయ్,, ప్రభాస్ వి అనుకుంటున్నావా.. కాదు అసలు ఏ సినిమా ఇది.. ఇలా సాగింది బ్రహ్మాజీ వరస. ఇదంతా ఇంటర్వ్యూ మధ్యలో వచ్చేదే కావొచ్చు. ప్రోమోగానే అనిపించొచ్చు. కానీ సత్యదేవ్ పై వేసిన షాట్స్ చూస్తే నిజమే అని భ్రమపడేవాళ్లు చాలామందే ఉన్నారు.

అసలు తమ సినిమాను తామే కించపరుచుకుంటూ ప్రమోషన్స్ చేస్తే అదేం కొత్తదనం అనుకుంటున్నారా లేక.. పిచ్చితనం అనుకోవాలా.. ఏదేమైనా ఈ ప్రమోషనల్ వీడియో బూమరాంగ్ అయిందనే చెప్పాలి. ఇలాంటివి చెబితే కూడా.. ‘ఇదుగో మేం చేసిన దాని గురించి మీరు రాసుకున్నారు కదా.. అదే మాక్కావాల్సింది’ అని అనుకునే అవకాశం కూడా లేకపోలేదు. 

Tags:    

Similar News