Australia: డ్రగ్స్‌ ఇచ్చి.. లైంగికంగా వేధించారు- క్వీన్స్‌లాండ్ మహిళా ఎంపీ

ఆస్ట్రేలియాలో దారుణం;

Update: 2024-05-05 23:45 GMT

ఆస్ట్రేలియాలో దారుణం చోటు చేసుకుంది. క్వీన్స్ లాండ్ ఎంపీగా ఉన్న బ్రిటనీ లాగా(37)కి డ్రగ్స్ ఇచ్చి, లైంగిక వేధింపులకు గురయ్యారు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. తన నియోజకవర్గం యెప్పూన్‌లో సాయంత్రం సమయంలో బయట దాడికి గురయ్యానని చెప్పారు. ఇది ఎవరికైనా జరిగి ఉండొచ్చు, ఇది విషాదకరం, ఇది మనలో చాలా మందికి జరుగుతుంది అని పోస్ట్‌లో పేర్కొన్నారు. గత వారాంతంలో నైట్ అవుట్‌లో తనకు మత్తుమందు ఇచ్చి లైంగికంగా వేధించారని క్వీన్స్ లాండ్ లేబర్ పార్టీ ఎంపీ బ్రిటీనీ లాగా చేసిన ఆరోపణలపై ఆస్ట్రేలియా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇటీవల ఈ ప్రాంతంలో ఇతర మహిళలపై కూడా ఇలాగే లైంగికదాడికి పాల్పడ్డారని చెప్పడం మరింత ఆందోళనకరంగా మారింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత ఏప్రిల్ 28న ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి పరీక్షల్లో తన శరీరంలో, తాను తీసుకొని డ్రగ్స్ ఉన్నట్లు నిర్ధారించారని ఆమె చెప్పింది. ఆ పదార్థం తనపై గణనీయంగా ప్రభావం చూపించిందని, ఇతర మహిళలు కూడా తనను సంప్రదించి తమ దుస్థితిని పంచుకున్నారని ఆమె చెప్పింది. లాగా దాదాపుగా ఒక దశాబ్ధంగా పార్లమెంట్ సభ్యురాలిగి ఉన్నారు, ఆమె మొదటిసారిగా 2015లో కెప్పెల్ స్థానానికి ఎన్నికయ్యారు.

ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్న క్వీన్స్ లాండ్ పోలీసులు ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఇతర నివేదికలు ఏమీ లేవని, ఎవరికైనా సమాచారం ఉంటే తమను సంప్రదించాలని కోరారు. ఈ ఘటనపై క్వీన్స్‌లాండ్ గృహణ నిర్మాణ మంత్రి మేఘన్ స్కాన్లాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన స్నేహితురాలు బ్రిట్నీ లౌగాపై జరిగిన దారుణం తనను షాక్‌కు గురిచేసిందని అన్నారు. ‘గృహ, కుటుంబ, లైంగిక హింసకు మహిళలు బాధితులు కావడం ఆమోదయోగ్యం కాదు. మా ప్రభుత్వం మహిళలను రక్షించడానికి, హింసను అరికట్టడానికి చేయగలిగినదంతా చేస్తూనే ఉంటుంది’ అని ఆమె పేర్కొన్నారు. ఇటీవల కాలంలో ఆస్ట్రేలియాలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి.

Tags:    

Similar News