Hijab Murder: హింసకు దారితీసిన హిజాబ్ వివాదం.. భజరంగ్‌దళ్‌ కార్యకర్త హర్ష దారుణ హత్య..

Hijab Murder: హిజాబ్‌ వివాదంతో కర్నాటక రగిలిపోతోంది. దాడులు ప్రతిదారులతో అట్టుడుకుతోంది.

Update: 2022-02-21 11:30 GMT

Hijab Murder: హిజాబ్‌ వివాదంతో కర్నాటక రగిలిపోతోంది. దాడులు ప్రతిదారులతో అట్టుడుకుతోంది. గత రాత్రి శివమొగ్గలో భజరంగ్‌దళ్‌ కార్యకర్త హర్ష హత్యతో ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి. శివమొగ్గ టౌన్‌లో పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. హర్ష హత్యకు ప్రతీకారంగా భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో.. రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. పలుచోట్ల వాహనాలను తగలబెట్టారు.

ఒక మతానికి చెందిన ప్రార్థనా స్థలాలకు నిప్పు పెట్టడానికి ప్రయత్నించారు. రెండు వర్గాల మధ్య దాడులతో శివమొగ్గ అట్టుడుకుతోంది. భారీగా వీధుల్లోకి వచ్చిన యువకులు.. రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో యువకులు రోడ్లపై కత్తులతో తిరిగారు. పెద్ద ఎత్తున బలగాలను మోహరించినా ఘర్షణలను అదుపుచేయలేకపోయారు.

హర్ష హత్య ఘటనతో పరిస్థితులు అదుపుతప్పాయి. దీంతో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. బహిరంగంగా గుమ్మిగూడటాన్ని, ర్యాలీలు, సభలను నిషేధించారు. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని ఆ రాష్ట్ర హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర అన్నారు. ఐదుగురు దుండగులు హత్యలో పాల్గొన్నట్లు భావిస్తున్న పోలీసులు.. దర్యాప్తును ముమ్మరం చేశారు.

హత్య వెనక ఏదైనా సంస్థ ఉన్నట్లు ఇంత వరకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. హిజాబ్‌ వివాదంతో సంబంధం ఉన్నట్లు నిర్ధారించలేమని చెబుతున్నారు. భజరంగ్‌దళ్‌ కార్యకర్త హర్ష హత్య రాజకీయంగ ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిపై కర్నాటక రూరల్‌ డెవలప్‌మెంట్‌ మినిస్టర్‌ కేఎస్‌ ఈశ్వరప్ప తీవ్రవ్యాఖ్యలు చేశారు. ముస్లిం గూండాలే ఈ హత్య చేశారని.. వాతావరణాన్ని మరింత వేడెక్కించారు.

కాంగ్రెస్‌ చీఫ్‌ డీకే శివకుమార్‌పైనా తీవ్ర ఆరోపణలు చేశారు. శివమొగ్గలో జాతీయ జెండా స్థానంలో కాషాయ జెండా ఎగురవేశారని.. హిజాబ్‌కు వ్యతిరేకంగా సూరత్‌లో 50వేల కాషాల శాలువాలకు ఆర్డర్‌ ఇచ్చారని శివకుమార్‌ చేసిన వ్యాఖ్యలే ఈ హత్యకు కారణమన్నారు. హిజాబ్‌ ఘర్షణలను రెచ్చగొట్టి హత్య జరిగేలా పురిగొల్పారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ ఆరోపణలను డీకే శివకుమార్‌ తోసిపుచ్చారు. విషయం కోర్టులో ఉందని.. ఇలాంటి కట్టుకథలను నమ్మాల్సిన అవసరం లేదని అన్నారు.

కర్నాటక ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. హర్ష హత్యకు ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా హత్య వెనక కాంగ్రెస్‌ పార్టీయో.. మరో సంస్థో ఉందని ఎలా అంటారని ఆయన ప్రశ్నించారు. హంతకులను పట్టుకుని ఉరిశిక్ష విధించాలని అన్నారు. లా అండ్‌ ఆర్డర్‌ను కాపాడటంలో విఫలమైన హోంమంత్రి జ్ఞానేంద్ర రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

Tags:    

Similar News