Crypto Fraud: హైదరాబాద్‌లో భారీ మోసం.. దుకాణం ఎత్తేసిన మాక్స్ క్రిప్టో ట్రేడింగ్ కంపెనీ
Crypto Fraud: హైదరాబాద్‌లో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. రాజేంద్రనగర్‌లో లక్షకు లక్ష ఇస్తామంటూ 4 వేల కోట్లు వసూలు చేసి.. చివరకు దుకాణం ఎత్తేసింది మాక్స్ క్రిప్టో ట్రేడింగ్ సంస్థ.;
Crypto Fraud: హైదరాబాద్‌లో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. రాజేంద్రనగర్‌లో లక్షకు లక్ష ఇస్తామంటూ 4 వేల కోట్లు వసూలు చేసి.. చివరకు దుకాణం ఎత్తేసింది మాక్స్ క్రిప్టో ట్రేడింగ్ సంస్థ. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. తక్కువ టైమ్‌లో ఎక్కువ ఆదాయం చూపిస్తాం.. ట్రేడింగ్‌లో ఆరితేరాం.. ఊహకందని రిటర్న్స్ తీసుకొస్తామంటూ అమాయకులను నమ్మించింది. సంస్థ ప్రతినిధుల మాటలు నమ్మేసి భారీ పెట్టుబడులు పెట్టారు జనం. దేశ వ్యాప్తంగా 25వేల మంది నుండి భారీ వసూళ్లకు పాల్పడింది. 8 నెలల తరువాత నట్టేట ముంచేశారు సంస్థ కేటుగాళ్లు.
మాక్స్ క్రిప్టో ట్రేడింగ్ ముసుగులో ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో రాజేంద్రనగర్‌లో కార్యాలయం ప్రారంభించారు. ప్రజలను ఆకట్టుకోవడానికి ఏసీ హాల్స్‌లో అదిరిపోయే మీటింగ్‌లు పెట్టారు. ఈ ఏడాది మైలార్‌దేవ్‌పల్లి దుర్గా కన్వెన్షన్ ఏసీ హాల్‌లో భారీ మీటింగ్ పెట్టగా.. వేలాది మంది హాజరయ్యారు. లక్షకు లక్ష అంటూ.. దేవుడి పేరుతో సెంటిమెంట్ మాటలు చెప్పారు ఖాలెద్ హుస్సేన్, ఆమేర్ హుస్సేన్. దుబాయ్ షేక్‌లు తమ వెనుక ఉన్నారని.. డబ్బును బిట్‌కాయిన్ రూపంలో మార్చి ఇస్తామంటూ నమ్మబలికారు. ఆ సెంటిమెంట్ నమ్మిన అమాయక ప్రజలు పెట్టుబడులు పెట్టారు.
ఏకంగా 25వేల మంది వద్ద నుంచి 4వేల కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. హఠాత్తుగా ఆఫీస్‌ను మూసేసి.. రాత్రికి రాత్రే జంప్ అయ్యారు. యాప్‌ను కూడా మూసేశారు. మోసపోయామని తీరిగ్గా తెలుసుకున్న బాధితులు.. లబోదిబోమంటున్నారు. నిర్వాహకులకు ఫోన్ చేస్తే తమ వెనుక దుబాయ్ షేక్‌లు ఉన్నారని.. ఏం చేసుకుంటారో చేసుకోండంటూ బెదిరింపులకు దిగుతున్నారని వాపోయారు. తమకు న్యాయం చేయాలంటూ హైదరాబాద్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
ఖాలెద్ హుస్సేన్, ఆమేర్ హుస్సేన్‌ని పట్టుకుని కఠినంగా శిక్షించాలని.. తమ డబ్బులు తమకు ఇప్పించాలని బాధితులు పోలీసులను కోరారు. ఈ నేపథ్యంలో మైలార్‌దేవ్‌పల్లి దుర్గా కన్వెన్షన్ వద్ద ఆందోళనకు దిగారు. వారి వద్ద డబ్బులు వసూలు చేసిన ఏజెంట్లను నిలదీశారు. అయితే.. వారు ఎక్కడ ఉన్నారో తెలియదని మధ్యవర్తులు అంటున్నారు. దీంతో బాధితులు దాడికి యత్నించారు. తమకు న్యాయం చేయాలంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకుని న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.