డ్రగ్స్ దందాలో ఎస్సై రాజేందర్ ఇటీవల పోలీసులకు పట్టుబడ్డ తీరు ఇంట్రెస్టింగ్‌గా ఉంది. చిక్కేవరకు ఆయన ఓ పోలీసు అధికారి అనే విషయమే ఎవరికీ తెలియదు. డ్రగ్స్ దందాలో ఎస్సై రాజేంద్రను పట్టించింది కేవలం వాట్సాప్ చాటింగే. ఈ మధ్య ఓ డ్రగ్స్ పెడ్లర్‌ను అదుపులోకి తీసుకున్న టీఎస్ న్యాబ్ బృందం... ఆ డ్రగ్స్ పెడ్లర్ వాట్సాప్ చాటింగ్ విశ్లేషించింది. పెద్ద ఎత్తున మాల్ ఉందని వాట్సాప్ చాటింగ్ ద్వారా గుర్తించారు. అందులో ఉన్న నెంబర్‌కు.. డ్రగ్స్ పెడ్లర్‌లా రాజేందర్‌తో యాంటీ నార్కోటిక్ పోలీసులు చాటింగ్ చేశారు. చాటింగ్ చేస్తూ డ్రగ్స్‌తో సహా ఎస్సై రాజేందర్ బయటికి వచ్చేలా స్కెచ్ వేశారు. ఐతే.. పట్టుబడేంతవరకు రాజేందర్ పోలీస్ అధికారని తెలియదు.
ఫిబ్రవరిలో మహారాష్ట్ర వెళ్లిన ఎస్సై రాజేందర్, మరో ముగ్గురు కానిస్టేబుళ్లు కందేశ్వర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లో ఓ నైజీరియన్ ఇంటిపై దాడి చేశారు. ముగ్గురు కానిస్టేబుళ్లను బయటే ఉంచి.. నైజీరియన్ ఇంట్లోకి వెళ్లిన రాజేందర్ ఆ ఇంట్లో 5 కిలోల మెతకోలిన్ డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. అందులో 1750 గ్రాముల డ్రగ్స్‌ను ఎస్సై రాజేందర్ దాచేశాడు. ఐతే.. ఎస్సై రాజేందర్‌తో పాటు వెళ్లిన ముగ్గురు కానిస్టేబుళ్లను కూడా విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. అటు.. డ్రగ్ పెడ్లర్లకు పరోక్షంగా సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపై స్పెషల్ బ్రాంచ్ నిఘా పెట్టింది.