కర్నూలు జిల్లాలో చిన్నటేకూరు వద్ద అత్యంత దారుణమైన ఘటన జరిగింది. వేమూరి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మంటల్లో దగ్ధమై 11 మందికి పైగా చనిపోయారు. ఇది అత్యంత ఘోరమైన ప్రమాదం. ఇంకా కొందరు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. అర్థరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజామున మూడున్నర గంటలకు వెనుక నుంచి వచ్చిన బైక్ బస్సును ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. బైకును బస్సు కొద్ది దూరం లాక్కెళ్ళడంతో ఆ బైకు ఢీకొని పెట్రోల్ ట్యాంకు ఒక్కసారిగా పేలింది. దీంతో దట్టమైన మంటలు బస్సులు వ్యాపించాయి. భయంకరమైన పొగ బస్సును కమ్మేసింది. ఆ ప్రమాదం జరిగిన సమయంలో అందరూ ఘాడ నిద్రలో ఉన్నారు. అసలు ఏం జరుగుతుందో తేరుకునే లోపే మంటల్లో చిక్కుకుపోయారు. ఇందులో కొద్ది మంది అలర్ట్ అయి కిటికీలోంచి దూకేసి ప్రాణాలను కాపాడుకున్నారు. కానీ ఇక్కడే ఒక చిన్న విషయం గురించి స్పష్టంగా చెప్పుకోవాలి.
బస్సు పెట్రోల్ ట్యాంక్ పేలింది ముందు భాగంలో. ఆ టైంలో డ్రైవర్ క్యాబిన్ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వాటిని గమనించిన డ్రైవర్ వెంటనే అలర్ట్ అయి తనప్రాణాలు కాపాడుకోవాలని ప్రయత్నించాడు. అంతేగాని బస్సు లోపల ఉన్న ప్రయాణికులను అలర్ట్ చేయలేదు. ఒకవేళ బస్సు డ్రైవర్ మంటలు చెలరేగుతున్నప్పుడే బస్సులో ఉన్న వాళ్లందర్నీ అలెర్ట్ చేసి వాళ్లను నిద్రలో నుంచి మేల్కొనేలా చేసి దిగిపోవాలని చెప్పి ఉంటే ఈ స్థాయిలో ప్రాణనష్టం జరిగేది కాదని ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికులు చెబుతున్నారు. బస్సు డ్రైవర్ చేసిన ఒక్క నిర్లక్ష్యం ఖరీదు వల్ల ఇంత మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ బస్సు గురించి కూడా చాలా రకాల ప్రచారాలు ఇప్పుడు తెరమీదకు వస్తున్నాయి.
ఈ బస్సు పై ట్రాఫిక్ చలానాలు చాలానే ఉన్నాయి. ఓవర్ స్పీడ్, ఎంట్రీ లేని ప్లేస్ లోకి వెళ్లడం, ట్రాఫిక్ రూల్స్ అస్సలు పాటించకపోవడం లాంటి అనేక ఫిర్యాదులు ఈ బస్సు మీద ఉన్నాయి. బైక్ ఢీకొన్న వెంటనే డ్రైవర్ కు తెలిసిపోతుంది. కానీ 90 మీటర్ల దాకా బస్సు బైక్ ను లాక్కెళ్తున్నా సరే డ్రైవర్ అలర్ట్ కాలేదు. ఇక్కడే డ్రైవర్లు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించాడు అనేది తెలిసిపోతుంది. ఈ బస్సు ప్రమాదంపై ఏపీ ప్రభుత్వం వెంటనే స్పందించింది. అందరికంటే ముందే సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హోం మంత్రి అనిత, డిజిపి ఘటనా స్థలానికి వెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని, మృతదేహాలను పరిశీలించి వైద్య సహాయాలు వేగంగా అందించాలంటూ ఆదేశించారు.