Kerala Acid Attack: యువకుడిపై మహిళ యాసిడ్ దాడి.. దేశంలోనే మొదటిసారి..
Kerala Acid Attack: ఒక మహిళ.. ఓ యువకుడిపై యాసిడ్ పోసింది. ఒక్కసారిగా ఈ ఘటన దేశవ్యాప్తంగా ప్రజలను ఆశ్చర్యపోయేలా చేసింది.;
Kerala Acid Attack (tv5news.in)
Kerala Acid Attack: ఒక అమ్మాయి తన ప్రేమను ఒప్పుకోకపోయినా.. పెళ్లికి నిరాకరించినా.. కనీసం మానవత్వం లేని, మనుషులలాగా ఆలోచించలేని అబ్బాయిలు తీసుకునే నిర్ణయమే యాసిడ్ అటాక్. ఎంతమంది బాధితులు ఎంత పోరాడిన ఈ యాసిడ్ అటాక్ అనేది దేశవ్యాప్తంగా ఎక్కడా తగ్గలేదు. కానీ ముందెన్నడూ లేని విధంగా ఒక మహిళ.. ఓ యువకుడిపై యాసిడ్ పోసింది. ఒక్కసారిగా ఈ ఘటన దేశవ్యాప్తంగా ప్రజలను ఆశ్చర్యపోయేలా చేసింది.
విన్నవారు ఎవరూ నమ్మలేని ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. కేరళలోని అడిమళికి చెందని షీబా, పూజాప్పురాకు చెందిన అరుణ్.. ఇద్దరికి సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. మెల్లగా ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అలా కొన్నిరోజులు సోషల్ మీడియాలో ఛాటింగ్ చేసిన తర్వాత షీబాకు పెళ్లయిందని, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని అరుణ్‌కు తెలిసింది.
అప్పటినుండి అరుణ్.. షీబాను దూరం పెడుతూ వచ్చాడు. కానీ షీబా మాత్రం తనను పెళ్లి చేసుకోమంటూ అరుణ్ వెంటపడడం మొదలుపెట్టింది. అరుణ్ ఒప్పుకోకపోవడంతో బ్లాక్‌మెయిల్ చేసి తన వద్ద నుండి రూ. 2 లక్షలు తీసుకుంది. ఆ తర్వాత ఈ విషయంపై మాట్లాడడానికి అరుణ్‌ను అడిమళికి రమ్మని పిలిచింది షీబా. అయినా అరుణ్ వినలేదు.
అరుణ్ కదలికలను గమనిస్తూ వచ్చిన షీబా.. తాను ఇరుంపుపళం వద్ద స్నేహితులతో ఉన్న సమయంలో తనపై యాసిడ్ దాడికి పాల్పడింది. ఆ తర్వాత అక్కడ నుండి తప్పించుకుంది. తన స్నేహితులు అరుణ్‌ను తిరువనంతపురం మెడికల్ కాలేజ్‌కు తరలించారు. అక్కడి వైద్యులు యాసిడ్ దాడి వల్ల అరుణ్ కంటిచూపు పోయిందని నిర్దారించారు.
యాసిడ్ దాడి చేసి తప్పించుకున్న షీబాను పోలీసులు పట్టుకున్నారు. దాడి చేస్తున్న సమయంలో తన చేతిపై కూడా యాసిడ్ పడడంతో గాయాలయ్యాయి. ఘటనాస్థలంలో ఉన్న సీసీ కెమెరాల్లో ఇదంతా రికార్డ్ అయ్యింది.