ఏడాది క్రితమే పెళ్లి.. ఎనిమిది నెలల గర్భం.. ఆర్థిక సమస్యలతో దంపతులు
సమస్యలు పరిష్కరించుకోలేని నిస్సహాయత.. చావు తప్ప మరో మార్గం లేదన్న ఆలోచన..;
సమస్యలు పరిష్కరించుకోలేని నిస్సహాయత.. చావు తప్ప మరో మార్గం లేదన్న ఆలోచన.. ఆ దంపతులు కలసి కాపురం చేసి ఏడాది కూడా కాలేదు.. అప్పుడే మరణం గురించిన ఆలోచనలు.. కడుపులో బిడ్డ ఉందన్న కనికరం కూడా లేదు.. దంపతులిద్దరూ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. కడుపులో ఉన్న చిన్నారి ఎంత చిత్రవధ అనుభవించిందో ఆ భగవంతుడికే తెలియాలి. ఈ విషాద సంఘటన కడపలో చోటు చేసుకుంది.
విజయదుర్గా కాలనీకి చెందిన సాయికుమార్ రెడ్డి, హేమామాలినీలకు ఏడాది క్రితం వివాహం జరిగింది. సాయి కుమార్ చిన్నా చితకా వ్యాపారాలు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. గత కొన్ని రోజులుగా కుటుంబంలో ఆర్థిక సమస్యలు తలెత్తాయి. దీనికితోడు హేమ 8 నెలల గర్భవతి. బిడ్డ పుడితే పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయని భావించారు భార్యాభర్తలు. ఆర్థిక సమస్యలనుంచి గట్టెక్కే మార్గం కనిపించలేదు. మరణమే శరణ్యం అనుకున్నారు.. మరో ఆలోచన లేకుండా మంగళవారం రాత్రి కడప శివారులోని కనుమలోపల్లి సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దంపతుల మృతికి ఆర్థికసమస్యలే కారణమా లేక మరే కారణమేదైనా ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.