CBI: కల్వకుంట్ల కవితకు సీబీఐ బిగ్ షాక్
ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించిన కొద్ది గంటల్లోనే సీబీఐ షాక్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు మరోసారి జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ట్రయల్ కోర్టు తీర్పుతో ఊరట లభించిన కొద్దిగంటల్లోనే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ భారీ షాక్ ఇచ్చింది. నిందితులందరినీ విడుదల చేస్తూ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సీబీఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ఈ కేసు మళ్లీ కొత్త మలుపు తిరిగింది.రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏళ్ల తరబడి సాగిన విచారణ, కీలక రాజకీయ నేతల అరెస్టులు, నెలల తరబడి జైలు జీవితం అనంతరం నిందితులకు ఊరట లభించడం పెద్ద చర్చకు దారి తీసింది. అయితే సీబీఐ మాత్రం ఈ తీర్పుతో అసంతృప్తిగా ఉంది. మద్యం విధానం రూపకల్పనలో అక్రమాలు జరిగాయని, ఆ ప్రక్రియలో కవిత పాత్రపై తమ వద్ద కీలక ఆధారాలు ఉన్నాయని పేర్కొంటూ ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. దీంతో కేసు మరోసారి న్యాయపరమైన పోరాట దశలోకి ప్రవేశించింది.
మరోవైపు ఈ పరిణామాలపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పందించారు. కోర్టు కేవలం సాక్ష్యాలు సరిపోలేదని మాత్రమే చెప్పిందని, కవితకు క్లీన్ చిట్ ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. కవిత చేస్తున్న రాజకీయ ఆరోపణలను ఖండిస్తూ, బీజేపీ మరియు బీఆర్ఎస్ ఒకటే అన్న వాదనలో నిజం లేదన్నారు. రాజకీయాల్లో పలువురు పలురకాలుగా వ్యాఖ్యానిస్తుంటారని, వాటికి ప్రతిస్పందించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.ఈ కేసు తీర్పు దర్యాప్తు సంస్థల విశ్వసనీయతపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం దర్యాప్తు సంస్థలను వినియోగిస్తున్నాయనే ఆరోపణలు మళ్లీ చర్చకు వచ్చాయి. అదే సమయంలో, నిందితులు విక్టిమ్ కార్డ్‌తో ప్రజల్లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. దర్యాప్తు సంస్థలపై, అనుచిత వ్యాఖ్యలు చేసిన నేతలపై పరువు నష్టం దావాలు కూడా వేయబడే అవకాశాలు ఉన్నాయని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఇంకా ముగిసిన అధ్యాయం కాదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. సీబీఐ అప్పీల్‌తో ఈ వ్యవహారం మళ్లీ దేశ రాజకీయాలను కుదిపేలా మారే సూచనలు కనిపిస్తున్నాయి.