ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేఏ పాల్ లైంగిక వేధింపుల పాల్పడ్డారని ఆరోపిస్తూ ఓ మహిళా ఫిర్యాదు చేయడంతో పంజాగుట్ట పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. కేఏ పాల్ ఆఫీసులో పనిచేసే ఓ మహిళ షీ టీమ్స్‌ను ఆశ్రయించారు. తనపై కేఏ పాల్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. వాట్సాప్‌లో అనుచిత సందేశాలు పంపుతున్నాడని చెప్పారు. అలాగే ఆఫీసులో అనుచితంగా తాకడం వంటివి చేస్తున్నాడని కూడా ఆరోపించారు. అయితే మహిళ ఫిర్యాదుపై స్పందించిన షీ టీమ్స్... ఫిర్యాదును పంజాగుట్ట పోలీసులకు పంపాయి. పంజాగుట్ట పోలీసులు కేఏ పాల్‌పై కేసు నమోదు చేశారు. విధి నిర్వహణలో ఉన్న తనను పాల్ లైంగికంగా వేధింపులకు గురిచేశాడని బాధితురాలు పేర్కొంది. దీనికి సంబంధించిన వాట్సాప్ మెసేజ్ లను పోలీసులకు అందజేసింది.
త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కేఏ పాల్ బరిలోకి దిగుతారని ప్రచారం జరగడంతో కొందరు ఆయనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని టీం చెబుతోంది. అందులో భాగంగానే కేఏ పాల్ ప్రతిష్ట దిగజార్చేందుకు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని ఆయన టీం పేర్కొంది. ఆయనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. పాల్ పరువు, ప్రతిష్టలకు భంగం కలిచేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే వారిపై చట్ట ప్రకారం పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించింది.