Crime : రాయచోటిలో వరద బీభత్సం.. బాధిత కుటుంబాల ఆర్థికసాయం అందజేత

Update: 2025-09-20 09:14 GMT

అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో కురిసిన భారీ వర్షానికి నలుగురు మృత్యువాత పడ్డారు. ఈ విషాద ఘటనపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. శనివారం ఉదయం మంత్రి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్‌తో కలిసి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. శుక్రవారం రాత్రి వరదనీటిలో కొట్టుకుపోయి మృతి చెందిన షేక్ ముని, ఇలియాస్, గణేష్‌ల కుటుంబాలను మంత్రి ఓదార్చారు. అలాగే నిన్న రాత్రి గల్లంతైన బాలిక యామిని మృతదేహం ఈ ఉదయం మాండవ్య నదిలో ఉన్న మురుగు కాలువలో లభ్యం కావడంతో ఆమె కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి ధైర్యం చెప్పారు. నలుగురు మృతుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఆర్థిక సాయం ప్రకటించిన ప్రభుత్వం  ప్రభుత్వం తరపున ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం చెక్కులను మంత్రి అందజేశారు. అంతేకాకుండా తన వ్యక్తిగతంగా కూడా ఒక్కో కుటుంబానికి రూ. 1 లక్ష చొప్పున మొత్తం రూ. 4 లక్షలు అందజేశారు.

రాయచోటి చరిత్రలో గత 30 ఏళ్లలో ఇంతటి భారీ వర్షం ఎన్నడూ కురవలేదని, ఊహించని వరదల కారణంగానే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. మురుగు కాలువల్లో కొట్టుకుపోయి నలుగురు మృతి చెందడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

Tags:    

Similar News