Uttar Pradesh: ఏకంగా 17 మంది విద్యార్థినులపై ప్రిన్సిపల్ అత్యాచారం.. మత్తు మందు ఇచ్చి..
Uttar Pradesh: ఈమధ్య పిల్లలకు దారి చూపించాల్సిన పెద్దవారే దారి తప్పుతున్నారు.;
Uttar Pradesh: ఈమధ్య పిల్లలకు దారి చూపించాల్సిన పెద్దవారే దారి తప్పుతున్నారు. ముఖ్యంగా టీచర్లను నమ్మి స్కూలుకు పంపిస్తే.. ఏ నిమిషం జీవితం ఎలా మారుతుందో అర్థం కావట్లేదు. టీచర్లే పిల్లలపై అఘాయిత్యం చేశారన్న వార్తలు ఈమధ్య ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా అలాంటి మరో ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
అతడు పేరుకే ప్రధానోపాధ్యాయుడు కానీ.. విద్యార్థుల జీవితాలను చిదిమేసే కీచకుడు. ఉత్తర ప్రదేశ్‌లో ముజఫర్‌నగర్‌లోని పుర్కాజి ప్రాంతంలో ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ పరీక్షల కారణం చెప్పి 17 మంది పదో తరగతి విద్యార్థినులను స్కూలుకు పిలిపించాడు. ఆ తరువాతి రోజు సీబీఎస్‌ఈ ప్రాక్టికల్ పరీక్షలు ఉన్నాయని, రాత్రంతా స్కూలులోనే ఉండాల్సి వస్తుందని వారికి సమాచారం అందించాడు.
ఆ రాత్రి విద్యార్థుల కోసం భోజనం తయారు చేయించి అందులో మత్తు మందు కలిపాడు. అది తిన్న విద్యార్థినులు అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత ఆ ప్రిన్సిపల్ మరొక వ్యక్తితో కలిసి వారిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని, వారి కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరించారు.
ప్రిన్సిపల్ బెదిరింపులకు భయపడిన విద్యార్థినులు ఇంట్లో వారి దగ్గర విషయాన్ని దాచారు. ఇద్దరు మాత్రం ధైర్యం చేసి ఈ విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అప్పటినుండి విద్యార్థినుల తల్లిదండ్రులు పోలీసుల చుట్టూ తిరుగుతున్నా.. లాభం లేకపోవడంతో వారు పుర్కాజి ఎమ్మెల్యే ప్రమోద్ ఉత్వాల్‌ను ఆశ్రయించారు. దీంతో నవంబర్‌లో జరిగిన ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఎమ్మెల్యే చొరవతో అఘాయిత్యానికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేశారు పోలీసులు. అందులో ఒకరిని అరెస్ట్ చేశారు కూడా. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు పుర్కాజి స్టేషన్ హౌస్ ఆఫీసర్ వినోద్ కుమార్ సింగ్‌ను సస్పెండ్ చేశారు.