RICH BEGGAR: ఓ యాచకుడి ఆస్తుల సామ్రాజ్యం
బిచ్చగాడి ఆస్తులు చూసి అధికారుల షాక్.... మూడు మేడలు, కార్లు, ఆటో రిక్షాలు... బ్యాంకు ఖాతాల్లో లక్షల్లో నగదు
చిరిగిపోయిన దుస్తులు… చేతిలో చక్రాల బండి… దానిపై కూర్చుని రోజంతా భిక్షాటన… చూసేవారెవరైనా “దయనీయమైన దివ్యాంగుడు” అనుకునేలా కనిపించే ఒక వ్యక్తి జీవితం వెనక, ఊహకందని ఆస్తుల సామ్రాజ్యం దాగి ఉందంటే నమ్మగలరా? మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్ నగరంలో తాజాగా బయటపడిన ఈ ఘటన, అధికారులతో పాటు ప్రజలను కూడా విస్తుపోయేలా చేసింది. ఇందౌర్‌ను “బిచ్చగాళ్లు లేని నగరం”గా మార్చాలన్న లక్ష్యంతో నగర పాలక సంస్థ, సామాజిక సంక్షేమ శాఖలు కలిసి ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టాయి. ఈ డ్రైవ్‌లో భాగంగా నగరంలోని ప్రధాన కూడళ్లు, మార్కెట్లు, దేవాలయాల పరిసరాల్లో భిక్షాటన చేస్తున్న వారిని గుర్తించి, వారికి కౌన్సెలింగ్ ఇస్తూ పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 6,500 మందిని గుర్తించి, వారి నేపథ్యాలను పరిశీలించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో నగరంలోని రద్దీగా ఉండే సరాఫ్ బజారు ప్రాంతంలో, చక్రాల బండిపై కూర్చుని భిక్షాటన చేస్తున్న మంగీలాల్ అనే దివ్యాంగుడిపై అధికారుల దృష్టి పడింది. . మొదట ఇతడిని కూడా మిగతా భిక్షాటన చేసే వారిలాగే పునరావాస కేంద్రానికి తరలించేందుకు అధికారులు ప్రయత్నించారు. కానీ విచారణ మొదలైన కొద్దిసేపటికే, ఒక్కొక్కటిగా బయటపడిన నిజాలు అధికారులనే కాదు, ఆ ప్రాంత ప్రజలను కూడా నోట మాట రానంతగా చేశాయి.
మేడలు, కార్లు
మంగీలాల్‌కు ఇందౌర్ నగరంలోనే మూడు మేడ భవనాలు ఉన్నట్లు గుర్తించారు. వీటిలో ఒక భవనాన్ని తాను దివ్యాంగుడినని చూపిస్తూ, రెడ్‌క్రాస్ సొసైటీ నుంచి ఉచితంగా పొందినట్టు అధికారులు నిర్ధారించారు. మిగిలిన రెండు భవనాలు కూడా పూర్తిగా అతడి పేరిటే నమోదై ఉండటం సంచలనం రేపింది.సరాఫ్ బజారులోని కొంతమంది బంగారం వర్తకులకు మంగీలాల్ భారీ మొత్తాల్లో వడ్డీకి డబ్బులు ఇచ్చినట్లు అధికారుల దర్యాప్తులో బయటపడింది.మంగీలాల్ ఇందౌర్ నగరంలో మాత్రం చక్రాల బండిపై భిక్షాటన చేస్తూ కనిపిస్తాడు. కానీ నగరం దాటిన తర్వాత అతడి జీవనశైలి పూర్తిగా మారిపోతుంది. బయట ప్రాంతాలకు వెళ్లేటప్పుడు అతడు స్విఫ్ట్ డిజైరు కారు వినియోగిస్తాడు. ఆ కారుకు ప్రత్యేక డ్రైవర్ కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాదు, అతడి పేరిట మూడు ఆటోరిక్షాలు ఉండగా, వాటిని అద్దెలకు తిప్పుతూ నెలకు మంచి ఆదాయం పొందుతున్నాడని తేలింది. అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కేవలం మంగీలాల్ ఒక్కరి కథ మాత్రమే కాదని చెబుతున్నారు. భిక్షాటన ముసుగులో ఆస్తులు కూడబెట్టే వారి సంఖ్య ఊహించిన దానికంటే ఎక్కువే ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు సంబంధిత అధికారి దినేష్ మిశ్ర తెలిపారు. మంగీలాల్‌కు సంబంధించిన ఆస్తుల మూలాలు, డబ్బు లావాదేవీలు, అక్రమంగా పొందిన లాభాలపై సమగ్ర విచారణ కొనసాగుతోందని ఆయన వెల్లడించారు. ఈ ఘటన, భిక్షాటన అనేది నిజంగా అవసరంలో ఉన్నవారికే పరిమితమా? లేక కొందరు దీన్ని ఒక వ్యాపారంగా మార్చుకున్నారా? అనే ప్రశ్నలకు తెరలేపుతోంది. అలాగే ప్రభుత్వ పథకాలను దుర్వినియోగం చేస్తున్న వారి పట్ల కఠిన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేస్తున్నారు.