SAD: బాలికల పీరియడ్స్ చెక్ చేసిన స్కూల్ సిబ్బంది
ఆరుగురు స్కూల్ సిబ్బంది సస్పెండ్;
మహారాష్ట్రలోని ఠాణె జిల్లాలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాఠశాల బాత్రూమ్లో నెలసరి రక్తపు మరకలు కనపడడంతో, వాటికి కారణమైన వారిని తెలుసుకునేందుకు వికృత చేష్టలకు పాల్పడ్డారు. బాలికలందరినీ లైన్లో నిలబెట్టి.. వారి వ్యక్తిగత అవయవాలను టచ్ చేస్తూ పీరియడ్స్‌లో ఉన్నారో, లేదో చెక్ చేయించారు.
మంగళవారం జరిగిన ఈ సంఘటనలో, 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న బాలికలందరినీ స్కూల్ కన్వెన్షన్ హాల్‌కు పిలిపించి, బాత్రూమ్లో తీసిన ఫోటోలు చూపిస్తూ, పీరియడ్స్‌లో ఉన్నవారూ, లేనివారూ వేరువేరుగా నిలబడాలని స్కూల్ ప్రిన్సిపల్ ఆదేశించారు. తనతో అబద్దం చెబుతున్నారని భావించిన ప్రిన్సిపల్, మహిళా అటెండెంట్‌ను పిలిపించి, పీరియడ్స్‌లో లేమని చెప్పిన బాలికల్ని చెక్ చేయించారని బాధితుల తల్లిదండ్రులు తెలిపారు. ఆ అటెండెంట్ బాలికలను వాష్‌రూమ్‌లోకి తీసుకెళ్లి వారి వ్యక్తిగత అవయవాలను తాకుతూ పరిశీలించడంతో, విద్యార్థినులు మానసికంగా తీవ్ర ఆవేదనకు గురైయ్యారు. ఇంటికెళ్లిన తర్వాత తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు స్కూల్ ముందు నిరసనకు దిగారు. ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రిన్సిపల్, ప్యూన్, నలుగురు టీచర్లు, ఇద్దరు ట్రస్టీలుపై కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. "ఇది పిల్లల గౌరవాన్ని, హక్కులను అవమానించడమే. ఇలా చెక్ చేయడం హింసకంటే తక్కువ కాదు" అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా సంస్థల్లో ఇటువంటి చర్యలు తీవ్రంగా ఖండించాల్సినవని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పౌరసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విధంగా పిల్లలకు గుప్త పరీక్షలు నిర్వహించడంపై తల్లిదండ్రులు , సామాజిక వేత్తలు నిరసన తెలిపారు. యుక్తవయస్సు పిల్లలను ఎంచుకుని ఈ విధంగా శల్యపరీక్షకు దిగారని పోలీసుల ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైంది. తమ పిల్లలను బట్టలు తీయించి మరీ పరీక్షించారని , ఇది దారుణం అని తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. రుతుక్రమం గురించి ఈ ఈడు పిల్లలకు సరైన అవగావహన కల్పించాల్సింది. పోయి ఈ విధంగా అమానుషంగా వ్యవహరించడం తమకు బాధాకర విషయం అయిందని బాలిక తల్లి ఒక్కరు వాపోయారు. ఈ స్కూల్ ప్రిన్సిపాల్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరారు.