వాళ్లు అనుకున్నట్టుగానే రాజు ఆత్మహత్య..
రాజు మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లారు. పోస్ట్‌మార్టం తరువాత డెడ్‌బాడీని బంధువులకు అప్పగించే అవకాశం ఉంది.;
పాపం పండింది. చిన్నారిని పాశవికంగా చిదిమేసిన రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. రాజు కోసం పోలీసులు జల్లెడ పుడుతున్న వేళ.. స్టేషన్ ఘన్‌పూర్ రాజారాం వంతెన వద్ద రైలు కింద పడి ప్రాణం తీసుకున్నాడు. రాజు చేతిపై మౌనిక అని పచ్చబొట్టు ఉండడంతో అతడే రాజు అని నిర్ధారించారు పోలీసులు. రాజు మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లారు. పోస్ట్‌మార్టం తరువాత డెడ్‌బాడీని బంధువులకు అప్పగించే అవకాశం ఉంది.
దేశం మొత్తం వినాయక చవితి ఏర్పాట్లలో ఉన్న సమయంలో.. ఆరేళ్ల చిన్నారిపై కన్నేశాడు రాజు. చిప్స్ ప్యాకెట్ కొనిస్తానని మాయ మాటలు చెప్పి.. తన గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. విషయం బయటకు చెబుతుందన్న భయంతో చిన్నారి గొంతు నులిమి చంపేశాడు. చిన్నారి మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించినప్పటికీ.. బయట హడావుడికి తీసుకెళ్లలేకపోయాడు. దీంతో పాప మృతదేహాన్ని గదిలోనే పెట్టి, బయట తాళం వెళ్లి బయటికి వెళ్లిపోయాడు. ఓవైపు చిన్నారి తల్లిదండ్రులు చిన్నారిని వెతుకుతున్న సమయంలోనే.. పాప దొరికిందా అంటూ వచ్చి ఆరా తీశాడు రాజు. ఆ సమయంలోనే రాజు తీరుపై అనుమానం వచ్చింది. పోలీసులకు సైతం తమ అనుమానాన్ని తెలియజేశారు. కాని, పోలీసులు స్పందించలేదు. పాప జాడ తెలియకపోవడంతో.. రాజు ఇంటిని వెతకాలనుకున్నారు. తాళం వేసి ఉండడంతో తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. పాప ఆచూకీ అయితే తెలిసింది గాని.. ప్రాణాలు మాత్రం లేవు.
ఆరేళ్ల చిన్నారిని రేప్ చేసి చంపేశాడని తెలియడంతో ఆగ్రహంతో ఊగిపోయారు స్థానికులు. వెంటనే రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేశారు. నిందితుడికి ఎన్‌కౌంటర్ చేయాలంటూ నినాదాలు చేశారు. వచ్చిన పోలీసులపైకి సైతం ఎదురుతిరిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఏకంగా కలెక్టరే రంగంలోకి దిగారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఇక ఆ తరువాత నుంచి రాజు గురించి సెర్చింగ్ మొదలు పెట్టారు. నిజానికి ఆ మరుసటి రోజే.. యాదాద్రి జిల్లాలోని తమ బంధువుల ఇంట్లోనే రాజు దొరికాడని ప్రకటించారు. తీరా.. దొరికింది రాజు కాదని నిర్ధారణ అవడంతో.. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో పోలీసులు మరింత సీరియస్‌గా సెర్చింగ్ ఆపరేషన్ మొదలు పెట్టారు.
నిజానికి నిన్నటి నుంచే రాజు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు నెటిజన్లు. అందుకే, పోలీసుల చేతికి చిక్కడం లేదని చెప్పుకొచ్చారు. దేశంలోనే నెంబర్ వన్ అనిపించుకున్న తెలంగాణ పోలీసులనే ముప్పతిప్పలు పెడుతున్నాడంటే.. కచ్చితంగా ఆత్మహత్య చేసుకునే ఉంటాడంటూ మెసేజ్‌లు పెట్టారు. అనుకున్నట్టుగానే రాజు వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ వద్ద రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్య చేసుకున్నాడు.