Suicide : ఐఐటీ మద్రాస్ లో విద్యార్థి ఆత్మహత్య
చదువులో మందగమనమే విద్యార్థి ఆత్మహత్యకు గల కారణంగా అనుమానిస్తున్నట్లు పోలీసులు చెప్పారు;
ఐఐటీ - మద్రాస్ లో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు తెలిపారు. చదువుపై సమస్యలు ఎదురవుతుండటంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నామని చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన విద్యార్థి మద్రాస్ ఐఐటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్నట్లు తెలిపారు. మంగళవారం రాత్రి అతని గదిలో ఉరివేసుకుని చనిపోయినట్లు చెప్పారు. చదువులో మందగమనమే విద్యార్థి ఆత్మహత్యకు గల కారణమని అనుమానిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ తర్వాతే మృతికి గల కారణాలు తెలియవస్తాయని తెలిపారు.
"ఐఐటీ మద్రాస్ లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలోని ఓ బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. సదరు విద్యార్థి మార్చి 14, 2023న అకాల మరణం చెందడం తీవ్ర వేదనతో కూడుకుని ఉంది. కోవిడ్ అనంతరం సవాలుతో కూడుకున్న పరిస్థితులను కాలేజీ యాజమాన్యం, అధ్యాపకులు, సిబ్బంది విద్యార్థుల శ్రేయస్సును మెరుగుపరిచేందుకు కృషిచేస్తున్నారు. ఇటీవల ఎన్నుకోబడిన విద్యార్థి ప్రతినిధులతో కలిసి సమస్యలను పరిష్కరించడానికి యాజమాన్యం ఎప్పుడూ ముందుంటుంది. చనిపోయిన విద్యార్థి కుటుంబ గోప్యతను గౌరవించాలని మేము ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్నాము. విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం అందించాము" అని ఐఐటీ ఓ ప్రకటనను విడుదల చేసింది.