కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. నిద్ర మత్తులోనే 19 మంది ప్రాణాలు కోల్పోవడం అంటే మాటలు కాదు. ఎంతో మంది అమాయకులు అన్యాయంగా మంటల్లో కాలిపోయారు. ఇంకా చాలా మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు. మరి ఈ ప్రమాదానికి కారణం ఎవరు.. బైక్ నడిపిన శివ శంకర్ ఫుల్లుగా మద్యం మత్తులో ఉన్నాడు. తెల్లవారు జామున తన స్నేహితుడు తిప్పేస్వామితో కలిసి డోన్ కు బయలుదేరాడు. కానీ అప్పటికే ఫుల్ మత్తులో ఉండి బైక్ ను అడ్డదిడ్డంగా నడిపాడు. పెట్రోల్ బంక్ లో అతను బైక్ ను తిప్పడం, స్లిప్ అయి పడబోవడం కూడా కనిపించింది.
ఇద్దరూ కలిసి వెళ్తుండగా డివైడర్ ను ఢీ కొట్టడంతో శివ శంకర్ అక్కడికక్కడే చనిపోయాడు. తిప్పేస్వామి గాయాలతో కింద పడ్డాడు. ఆ బైక్ వెళ్లి నడిరోడ్డుపై పడటంతో.. గమనించని బస్ డ్రైవర్ ఆ బైక్ ను ఢీ కొట్టి 300 మీటర్ల దాకా లాక్కెళ్లాడు. బైక్ వెళ్లి పెట్రోల్ ట్యాంక్ కు ఢీకొట్టి అగ్నిప్రమాదం జరిగింది. ఈ మొత్తంలో శివశంకర్ తప్పు ఎంత ఉందో.. బస్ డ్రైవర్ తప్పు ఎంత ఉందో.. వ్యవస్థ తప్పు కూడా అంతే ఉంది. ఈ ప్రమాదంతో రెండు తెలుగు రాష్ట్రాల రవాణా శాఖ అధికారులు ఏదో హడావిడి చేస్తున్నారు. ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలకు వార్నింగులు ఇస్తున్నారు. అక్కడికేదో ఇప్పుడే వాళ్లకు తమ డ్యూటీ గుర్తొచ్చినట్టు తాత్కాళిక హడావిడి మొదలు పెట్టారు.
వాస్తవానికి వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు రూల్స్ కు విరుద్ధంగానే స్లీపర్ బస్సుగా డిజైన్ అయిందంటున్నారు. మరి ఇలా రూల్స్ కు విరుద్ధంగా ఫిట్ నెస్ లేకుండా, స్లీపర్ బస్సుగా మార్చడంపై ఎందుకు చర్యలు తీసుకోలేదు. ఆ నిర్లక్ష్యమే కదా ఇప్పుడు ఇంత మంది ప్రాణాలను తీసింది. ప్రయాణికులు వేగంగా కిందకు దిగలేక ఇబ్బంది పడి చివరకు ప్రాణాలు కోల్పోయారు. ఈ నిర్లక్ష్యంలో వ్యవస్థ తప్పులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి పొరపాట్లు జరగకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి. ఏదో తాత్కాళిక హడావిడి చేసి సైలెంట్ కాకుండా ఇలాంటి రూల్స్ కు విరుద్ధంగా నడుస్తున్న బస్సులను సీజ్ చేయాలి. లైసెన్స్ లేని, ఓవర్ స్పీడ్ గా డ్రైవర్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. రూల్స్ పాటించని ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలను మూసేయాలని ప్రజలు కోరుతున్నారు.