నటుడు పోసాని కృష్ణమురళికి రైల్వే కోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను కడప సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉంది. నిన్న 9 గంటల పాటు విచారించిన పోలీసులు రాత్రి జడ్జి ముందు హాజరుపర్చారు. రా.9 గంటల నుంచి ఉ.5 గంటల వరకు సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. పోసాని తరఫున వాదనలు వినిపించిన పొన్నవోలు సుధాకర్ బెయిల్ ఇవ్వాలని కోరారు. అందుకు న్యాయమూర్తి నిరాకరించారు.
పోసాని కృష్ణమురళిపై పోలీసులు దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు ప్రస్తావించారు. ‘పోసాని దారుణమైన వ్యాఖ్యలు చేశారు. అసభ్య పదజాలంతో దూషించారు. పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా 14 కేసులున్నాయి. సినీ రంగానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయన వ్యాఖ్యలు చాలామందిపై ప్రభావం చూపుతాయి. సమాజంలో విభజన, ఉద్రిక్తతలు తెచ్చేలా ఆయన మాట్లాడారు’ అని పోలీసులు పేర్కొన్నారు.