కారు ప్రమాదంలో దర్శకుడి కుమారుడు మృతి

చిత్ర దర్శక నిర్మాత అశ్విని ధీర్ తన 18 ఏళ్ల కుమారుడు జలజ్ ధీర్‌ను కారు ప్రమాదంలో కోల్పోయాడు.;

Update: 2024-11-27 05:46 GMT

అతిథి తుమ్ కబ్ జావోగే , సన్ ఆఫ్ సర్దార్ వంటి చిత్రాలకు ప్రసిద్ధి చెందిన దర్శక నిర్మాత అశ్విని ధీర్, తన 18 ఏళ్ల కుమారుడు జలజ్ ధీర్‌ను విషాదకరమైన కారు ప్రమాదంలో కోల్పోయాడు. ప్రమాదం జరిగినప్పుడు జలజ్ ముగ్గురు స్నేహితులతో కలిసి కారులో ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో జలజ్ అతని స్నేహితుడు ఒకరు మరణించారు. 

కారు నడుపుతున్న వ్యక్తి మద్యం తాగి 120-150 మైళ్ల వేగంతో డ్రైవింగ్ చేసినట్లు సమాచారం. విలేపార్లే వద్ద సర్వీస్ రోడ్డు, వంతెన మధ్య డివైడర్‌ను ఢీ కొట్టడంతో కారు ధ్వంసమైంది. ఈ దురదృష్టకర ప్రమాదంలో జలజ్ మరియు అతని స్నేహితుడు సార్థక్ కౌశిక్ ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద విషయాన్ని  ప్రాణాలతో  బయటపడ్డ మరో స్నేహితుడు జిమ్మీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు కింద డ్రైవర్ సాహిల్ మెంధాను పోలీసులు అరెస్ట్ చేశారు. 

జలజ్ మరియు అతని ముగ్గురు స్నేహితులు తెల్లవారుజామున 3:30 గంటల వరకు వీడియో గేమ్‌లు ఆడి డ్రైవ్‌కు వెళ్లారు. వారు డిన్నర్ కోసం బాంద్రాలోని సిడ్గి వద్ద ఆగి, ఉదయం 4:10 గంటలకు కారులో తిరిగి వచ్చారు. మద్యం మత్తులో ఉన్న సాహిల్ డ్రైవింగ్ చేస్తున్నాడు. స్టీరింగ్ పై నియంత్రణ కోల్పోవడంతో కారు డివైడర్ ను ఢీకొట్టింది. సాహిల్ మరియు జిమ్మీ తక్కువ గాయాలతో బయటపడగా, జలజ్ మరియు సార్థక్‌లకు తీవ్ర గాయాలయ్యాయి.

జలజ్‌ను జోగేశ్వరి తూర్పులోని ట్రామా ఆసుపత్రికి తరలించారు. అనంతరం కోకిలాబెన్ ధీరుబాయ్ అంబానీ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వైద్యులు చికిత్స అందించినా ప్రాణాలు కాపాడలేకపోయారు. మరోవైపు, సార్థక్‌ను బాంద్రా వెస్ట్‌లోని భాభా ఆసుపత్రికి తీసుకెళ్లారు, అక్కడ పరీక్ష తర్వాత అతను మరణించినట్లు ప్రకటించారు.

Tags:    

Similar News