AP: లడ్డూ కల్తీ వ్యవహారంపై మరో సంచలన నిర్ణయం
సూత్రధారులు ఎవరో తెల్చేందుకు విచారణ కమిషన్
తిరుమల లడ్డూ కల్తీ ఆరోపణల వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంలో వాస్తవాలను పూర్తిస్థాయిలో వెలికితీయాలన్న ఉద్దేశంతో ప్రత్యేక విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గంటలపాటు సాగిన క్యాబినెట్ సమావేశంలో ఈ అంశంపై విస్తృతంగా చర్చ జరిగినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సమర్పించిన నివేదికపై మంత్రివర్గం లోతుగా చర్చించింది. సిట్ నివేదికలో ప్రస్తావించిన అంశాలు, దర్యాప్తు సమయంలో బయటపడ్డ వాస్తవాలు, అలాగే కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ల మధ్య పలు వ్యత్యాసాలు ఉన్నట్లు మంత్రివర్గం అభిప్రాయపడింది. ముఖ్యంగా దర్యాప్తులో గుర్తించిన కొన్ని కీలక అంశాలు ఛార్జ్‌షీట్‌లో ఎందుకు పొందుపరచలేదన్న అంశంపై తీవ్ర చర్చ జరిగింది.
ఈ పరిస్థితుల్లో కేవలం సిట్ నివేదిక ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం సరైనదికాదని మంత్రివర్గం భావించింది. అందుకే మొత్తం వ్యవహారాన్ని సమగ్రంగా పరిశీలించి, నిజానిజాలను స్పష్టంగా నిర్ధారించే బాధ్యతను ఒక స్వతంత్ర విచారణ కమిషన్‌కు అప్పగించాలని నిర్ణయించింది. ఈ కమిషన్ సిట్ విచారణ ప్రక్రియ, నివేదిక, ఛార్జ్‌షీట్ దశలను పరిశీలించి, వాటిలో ఉన్న లోపాలు, తేడాలపై స్పష్టమైన నివేదిక ఇవ్వనుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.అసలు ఈ కల్తీ వ్యవహారానికి బాధ్యులెవరు, వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు అనే విషయాన్ని ప్రజల ముందుకు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రివర్గం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దేవాలయ ప్రతిష్ఠకు భంగం కలిగించే అంశమైనందున, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా వాస్తవాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమైంది. విచారణ కమిషన్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించనుందని సమాచారం. ఈ నిర్ణయంతో తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం మరో మలుపు తిరిగినట్లుగా రాజకీయ, భక్తుల వర్గాల్లో చర్చ జరుగుతోంది.