Rajasthan: కోటాలో మరో నీట్ అభ్యర్థి ఆత్మహత్య.. చదువు ఒత్తిడి కాదంటున్న పోలీసులు..
అమ్మా నాన్న కలను సాకారం చేయాలని కొందరు, వారి ఒత్తిడితో కొందరు,;
చదువు, ర్యాంకుల ఒత్తిడితో విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు పిల్లలపై భారం మోపకున్నా ఇంటికి దూరంగా పగలు, రాత్రి కోచింగ్ సెంటర్ లో గడపడం, తమ తోటి విద్యార్ధులు ఒత్తిడితో ఉన్నా ఆ ప్రభావం మిగిలిన విద్యార్ధుల మీద కూడా పడుతుండడం విద్యార్ధుల ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. సమస్యకు ఆత్మహత్య పరిష్కారం కాదని తెలిసినా ఆ సమయానికి చెప్పే వాళ్లు ఎవరూ ఉండకపోవడం మానసిక ఒత్తిడికి కారణమవుతోంది. రాజస్థాన్ కోటాలో మరో నీట్ అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపుతోంది, తల్లిదండ్రుల గుండెల్లో గుబులు మొదలవుతోంది. దీంతో ఈ సంవత్సరం నగరంలో విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య ఏడుకి చేరుకుంది.
మృతుడిని 18 ఏళ్ల అంకుష్ మీనాగా గుర్తించారు. దాదాబరి ప్రాంతంలోని ప్రతాప్ నగర్ ప్రాంతంలోని అతడు నివసిస్తున్న పీజీ వసతి గృహంలో సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. సవాయి మాధోపూర్ నివాసి అయిన అంకుష్ గత రెండు సంవత్సరాలుగా కోటాలో నివసిస్తున్నాడు. నీట్ మెడికల్ ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్నాడు.
పదే పదే తలుపు తట్టినా అంకుష్ స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన పీజీ యజమాని తలుపు పగలగొట్టి చూసేసరికి అతను ఉరివేసుకుని ఉండటంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్య వెనుక ఖచ్చితమైన కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదని, విద్యాపరమైన ఒత్తిడి లేదా వ్యక్తిగత సమస్యలు కారణమా అని నిర్ధారించడానికి దర్యాప్తు జరుగుతోందని పోలీసు అధికారులు తెలిపారు.