తెలంగాణ సహా 5 రాష్ట్రాల్లో త్వరలోనే ఎన్నికల నగరా మోగనుంది. మొత్తం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభించింది సీఈసీ. తెలంగాణ, చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాల్లో అంసెబ్లీ ఎన్నికల గడువు దగ్గర పడుతుండటంతో ఈ మేరకు చర్యలు చేపట్టింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం ప్రారంభించిన సీఈసీ... 5 రాష్ట్రాల సీఎస్‌లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నేపథ్యంలోఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా పటిష్ట చర్యలు చేపడుతుంది. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేలా ప్లాన్ రెడీ చేస్తోంది. ఇందులో భాగంగానే ఐదు రాష్ట్రాల్లోని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది సీఈసీ.
ఎన్నికల అధికారులు సొంత జిల్లాల్లో విధులు నిర్వర్తించరాదని సీఈసీ స్పష్టం చేసింది. ఇక ప్రస్తుతం ఉన్న పోస్టుల్లో మూడేళ్లకు మించి ఉండరాదని తాజా నిబంధనలు తీసుకువచ్చింది. కీలక స్థానాల్లో ఉన్న రెవెన్యూ, పోలీస్ అధికారులను బదిలీ చేయాలని సీఈసీ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు క్రిమినల్ కేసులు లేవని అధికారుల నుంచి డిక్లరేషన్ తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అభ్యర్థుల్లో తమ బంధువులు లేరని కూడా అధికారుల నుంచి డిక్లరేషన్ తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. జులై 31 లోపు బదిలీల ప్రక్రియ పూర్తి చేశాయాలని ఆదేశించిన సీఈసీ.. ఈ మేరకు తమకు నివేదిక ఇవ్వాలని చెప్పింది.