సముద్రంలో మునిగిపోతున్న యువకుల్ని కాపాడిన బీజేపీ ఎమ్మెల్యే
కల్పేష్ షియాల్, విజయ్ గుజారియా, నికుల్ గుజారియా, జీవన్ గుజారియా అనే నలుగురు యువకులు పట్వా గ్రామం సమీపంలోని సముద్రం వద్దకు వెళ్లారు.
సముద్రంలో మునిగిపోతున్న యువకుల్ని కాపాడిన బీజేపీ ఎమ్మెల్యే వార్తల్లో నిలిచారు. గుజరాత్‌లోని రాజుల నియోజకవర్గం ఎమ్మెల్యే హిరా సోలంకి ముగ్గురు యువకుల ప్రాణాలను కాపాడారు. అక్కడికి వచ్చిన కొందరు వ్యక్తులు కూడా యువకులను రక్షించేందుకు సహకరించడంతో యువకులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. దురదృష్టవశాత్తూ ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన పట్వా గ్రామం సమీపంలో జరిగింది.
కల్పేష్ షియాల్, విజయ్ గుజారియా, నికుల్ గుజారియా, జీవన్ గుజారియా అనే నలుగురు యువకులు పట్వా గ్రామం సమీపంలోని సముద్రం వద్దకు వెళ్లారు. స్నానం చేయడం కోసం వీరు సముద్రంలో దిగారు. అదే సమయంలో ప్రవాహం తీవ్ర స్థాయిలో రావడం, పెద్ద గాలి వీయడంతో వీరంతా సముద్రంలోకి జారిపోయారు. తమను కాపాడాలంటూ పెద్ద ఎత్తున కేకలు వేశారు. సముద్రం ఒడ్డున ఉన్న చాలా మంది దీనిని గమనించారు. అక్కడే ఉన్న ఎమ్మెల్యే హీరా సోలంకి వెంటనే సముద్రంలోకి దూకి, కొట్టుకుపోతున్న నలుగురిలో ముగ్గుర్ని కాపాడగలిగారు. వీరిని ఓ పడవలోకి ఎక్కించి, ఒడ్డుకు చేర్చారు. అయితే జీవన్ గుజారియా మాత్రం వేగంగా సముద్రంలోకి కొట్టుకుపోయారు.