నమీబియా నుంచి తీసుకొచ్చిన ఓ చిరుత నేషనల్ పార్క్ నుంచి తప్పించుకుని దగ్గరలోని ఓ గ్రామంలోకి ప్రవేశించింది. ఈ ఘటన ఆదివారం జరిగింది. చిరుత సమాచారం తెలుసుకున్న అధికారులు చిరుత ఉన్న ప్రాంతానికి వెళ్లారు. గత నెలలో నమీబియా నుంచి తీసుకొచ్చి మధ్యప్రదేశ్‌లోని షియోపూర్ జిల్లాలోని కునో నేషనల్ పార్క్ అడవిలో వదిలేసిన చిరుతల్లో ఒకటి, జాతీయ పార్కుకు 20 కిలోమీటర్ల దూరంలోని విజయపూర్‌లోని జార్ బరోడా గ్రామంలోకి ప్రవేశించింది. జిల్లా అటవీ అధికారి (DFO) ప్రకారం, “నమీబియా నుంచి తీసుకువచ్చిన చిరుతలలో ఒకటైన చిరుత ఒబాన్, కునో నేషనల్ పార్క్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయ్‌పూర్‌లోని జార్ బరోడా గ్రామంలోకి ప్రవేశించింది. పర్యవేక్షణ బృందం కూడా గ్రామానికి చేరుకుంది. చిరుతను వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి." అని తెలిపారు.
పీసీసీఎఫ్ వైల్డ్‌లైఫ్ జస్వీర్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ నమీబియా చిరుత ఒబాన్ కునో నేషనల్ పార్క్ సరిహద్దు రేఖను దాటి విజయ్‌పూర్ ప్రాంతంలోని జార్ బరోడా గ్రామానికి చేరిన మాట వాస్తవమేనని అన్నారు. “మేము చిరుత యొక్క ప్రతి కదలికను గమనిస్తున్నాము. మా బృందాలు చిరుతపులికి దగ్గరగా ఉన్నందున ఆందోళన చెందాల్సిన పని లేదు. పార్క్‌లోని ఓపెన్ ఫారెస్ట్‌కి తీసుకెళ్తాం’’ అని చౌహాన్ చెప్పారు.
ఓబాన్, ఆషా అనే రెండు చిరుతలను మార్చి 11న మధ్యప్రదేశ్‌లోని షియోపూర్ జిల్లా కునో నేషనల్ పార్క్ అడవిలో విజయవంతంగా విడుదల చేశారు. భారతదేశం నుంచి అంతరించిపోయిన 70 సంవత్సరాల తరువాత, చిరుతలు తిరిగి భారత గడ్డపైకి వచ్చాయి. మొత్తం 20 చిరుతలు రెండు బ్యాచ్‌లలో భారతదేశానికి వచ్చాయి - నమీబియా నుంచి మొదటి బ్యాచ్ ఎనిమిది చిరుతలు సెప్టెంబర్ 2022లో వచ్చాయి, దక్షిణాఫ్రికా నుంచి మరో 12 ఫిబ్రవరిలో వచ్చాయి. భారతదేశం గతంలో ఆసియాటిక్ చిరుతలకు నిలయంగా ఉండేది, అయితే 1952 నాటికి దేశీయంగా ఈ జాతి అంతరించిపోయినట్లు ప్రకటించారు.