Air India Urination Row: శంకర్ మిశ్రా అబద్ధాల కోరు...
మిశ్రా న్యాయవాది వాస్తవాన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డ బాధితురాలు; కేసును పక్కదారి పట్టిస్తున్నారంటూ వ్యాఖ్యలు;
ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో సహ ప్రయాణీకురాలిపై మూత్రవిసర్జన చేసిన వ్యవహారంలో బాధితురాలు తొలిసారి స్పందించారు. ఇటీవల శంకర్ మిశ్రా చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని వెల్లడించారు. తనకు అబద్ధమాడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
బాధితురాలిగా పేర్కొంటోన్న మహిళ తనపై తానే మూత్రవిసర్జన చేసుకుని, తనపై నిందలు మోపుతోందని నిందితుడు శంకర్ మిశ్రా లాయర్ కొత్త వాదన తెరపైకి తీసుకువచ్చిన సంగతి విదితమే. ఆమె యూరినరీ ఇన్ కంటినెన్స్ తో బాధపడుతున్నట్లు కూడా ఆరోపించారు. ఈ ఆరోపణలపై స్పందించిన బాధితురాలు, నిందితుడు బెయిల్ పిటిషన్ లో పేర్కొన్న అంశాలకు తాజాగా వ్యాఖ్యలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు.
చేసిన చెత్తపనికి కనీసం పశ్చాత్తాపం కూడా లేకుండా నిందితుడు వ్యవహరిస్తున్న తీరుపై ఆమె మండిపడ్డారు. అతడు తప్పుడు వార్తలను వ్యాపింపజేస్తున్నాడని ఆరోపించారు. ఈ అబద్ధాలతో తనను మిరింత కుంగదీసేందుకు ప్రయత్నిస్తున్నాడని స్పష్టం చేశారు.