CM Jagan Delhi Tour: సీఎం జగన్ ఢిల్లీ టూర్.. రాజకీయ వర్గాల్లో చర్చ

CM Jagan Delhi Tour: సీఎం జగన్‌ ఢిల్లీ వెళ్లింది రాష్ట్ర ప్రయోజనాల కోసమా.. లేక రాజకీయ వ్యవహారాలపైనా?

Update: 2022-12-28 06:00 GMT

CM Jagan Delhi Tour: సీఎం జగన్‌ ఢిల్లీ వెళ్లింది రాష్ట్ర ప్రయోజనాల కోసమా.. లేక రాజకీయ వ్యవహారాలపైనా? ఢిల్లీ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం.. రాష్ట్రంలో రాజకీయపరమైన చిక్కులు, ఇబ్బందులపై కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చించడానికి సీఎం జగన్ ఢిల్లీ వెళ్లారని అంటున్నారు. ప్రత్యేకించి కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో భేటీలో కీలక అంశాలపై చర్చించనున్నట్టు చెప్పుకుంటున్నారు. అమిత్‌షాతో జరిపే చర్చలో వైఎస్‌ వివేకా హత్య కేసు, ఢిల్లీ లిక్కర్ స్కాం, కేసీఆర్‌తో సంబంధాలు, ఇతర రాజకీయ చిక్కులపై జగన్ చర్చించే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది.


వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్ తమ్ముడు ఎంపీ అవినాష్ రెడ్డి పాత్రపై అనుమానాలు ఉన్నాయన్న సీబీఐ.. దానిపై లోతైన దర్యాప్తు జరపాల్సి ఉందని తెలిపింది. వివేక హత్య కేసును సుప్రీంకోర్టు హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ చేసిన నేపథ్యంలో అమిత్‌షాతో దీనిపైనే ప్రధానంగా చర్చిస్తారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.



ఇక ఢిల్లీ లిక్కర్ స్కాంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బంధువుల పాత్ర ఉందని బయటపడింది. విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు శరత్ చంద్రారెడ్డిని ఈడీ అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. జనవరి మొదటి వారంలో శరత్ చంద్రారెడ్డి సహా ఇతర నిందితులపై ఛార్జిషీట్ దాఖలు చేయనుంది ఈడీ. ఈ ఛార్జ్ షీట్‌లో కీలక అంశాలు వెల్లడయ్యే అవకాశం ఉందంటున్నారు.


ఇక సీఎం కేసీఆర్‌తో సంబంధాలపై బీజేపీ పెద్దలు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికీ, సీఎం కేసీఆర్‌తో జగన్‌ సన్నిహిత సంబంధాలు కొనసాగించడంపై బీజేపీ ముఖ్యులు ఆగ్రహంగా ఉన్నారని చెప్పుకుంటున్నారు. ప్రధాని మోదీ సహా బీజేపీ ముఖ్యలను లక్ష్యంగా చేసుకుని సీఎం కేసీఆర్‌ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌తో జగన్ సన్నిహితంగా మెలగడంపై బీజేపీ ముఖ్య నేతలు ఆగ్రహంగా ఉన్నారని చెబుతున్నారు.


కొద్దిరోజుల కిందట షర్మిల కారును తెలంగాణ పోలీసులు లాక్కెళ్లినా.. సీఎం జగన్‌ మౌనంగా ఉండడంపై ప్రధాని మోదీ ఢిల్లీలోనే అడిగేశారు. ఎందుకు ఖండించలేకపోయారని ప్రధాని మోదీ జగన్‌ను ప్రశ్నించారు. ఈ ఘటనపై జగన్‌ను అడిగిన మరుసటి రోజే స్వయంగా షర్మిలకు ఫోన్ చేసి మాట్లాడారు ప్రధాని మోదీ. మొత్తంగా సీఎం జగన్‌ ఢిల్లీ టూర్ మొత్తం.. రాజకీయ వ్యవహారాలపైనే ఉంటుందని చెబుతున్నారు.

Tags:    

Similar News