Ashish Mishra: లఖింపూర్ ఘటనలో ట్విస్ట్.. ఫోరెన్సిక్ రిపోర్ట్‌‌తో చిక్కుల్లో ఆశీష్‌ మిశ్రా..

Ashish Mishra: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌ లఖింపూర్ ఘటన కేసు మరో మలుపు తీసుకుంది.

Update: 2021-11-10 04:00 GMT

Ashish Mishra (tv5news.in)

Ashish Mishra: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌ లఖింపూర్ ఘటన కేసు మరో మలుపు తీసుకుంది. అక్టోబర్ 3న జరిగిన హింసాత్మక ఘటనలో కాల్పులు జరిపింది కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశీష్‌ మిశ్రానే అని ఫోరెన్సిక్ రిపోర్ట్ తెలిపింది. నాటి ఘటనలో ఆశీష్ మిశ్రాతో పాటు అంకిత్ దాస్ కూడా కాల్పులు జరిపినట్లు వెల్లడించింది.

నిరసన ప్రదేశంలో ఆశీష్ మిశ్రాకు చెందిన లైసెన్స్‌డ్ తుపాకీ నుంచే బుల్లెట్లు వచ్చాయని ఫోరెన్సిక్ రిపోర్ట్ పేర్కొంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశీష్ మిశ్రా ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అయితే ఇప్పుడు కాల్పులు చేసింది ఆశీష్‌ మిశ్రానే అని ఫోరెన్సిక్ రిపోర్ట్ స్పష్టం చేయడంతో అజయ్ మిశ్రా మరింత ఇరకాటంలో పడ్డారు.

కుమారుడిని నిందితుల జాబితా నుంచి తప్పించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలకు ఫోరెన్సిక్ రిపోర్ట్ అడ్డుకట్ట వేసింది. దీంతో విచారణలో ఆశీష్ మిశ్రా అబద్దాలు చెప్పారని, కొడుకును కాపాడుకునేందుకు ఆశీష్ మిశ్రా వాహనం నడపలేదని ఇన్నాళ్లూ చెప్తూ వచ్చిన అజయ్ మిశ్రా అసలు నిజాలను దాచి అసత్య ఆరోపణలు చేశారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా లఖింపూర్‌లో రైతులు నిరసన చేపట్టారు. యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటనను అడ్డుకునేందుకు రోడ్డెక్కిన వందలాది మంది రైతులు ఆందోళనకు దిగారు. అయితే ఇదే సమయంలో కేంద్రమంత్రి అజయ్ మిశ్రాకు చెందిన కాన్వాయ్ రైతులపై దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో నలుగురు రైతులు, ఒక జర్నలిస్ట్ సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా కలకలం రేపిన లఖింపూర్ ఘటనపై సిట్ విచారణ కొనసాగుతుండగా.. నిందితుడిని కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ దర్యాప్తు విధానంపై ఇటీవల సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మరి.. కాల్పులు జరిపింది ఆశీష్ మిశ్రా అని ఫోరెన్సిక్ రిపోర్ట్ స్పష్టం చేయడంతో యూపీ ప్రభుత్వం ఏవిధంగా ముందుకెళ్తుందో చూడాలి.

Tags:    

Similar News