Bengaluru: అమ్మ చనిపోయందని తెలియక, శవం పక్కనే రెండు రోజులు నిద్దరోయిన చిన్నారి...
బెంగళూరులో చోటుచేసుకున్న హృదయవిదాకర ఘటన; కంట తడి పెట్టిస్తున్న చిన్నారి పరిస్థితి;
చనిపోయిన తల్లి నిద్దరోతోందని భావించిన 11 ఏళ్ల ఓ చిన్నారి...రెండు రోజుల పాటూ అమ్మ పక్కనే పడుకున్నాడు. బడికి పోలేక, ఆకలికి తాళలేక పక్కింట్లో తిని అమ్మవద్దనే ఉండిపోయాడు. ఈ హృదయవిదారక ఘటన బెంగళూరులోని గంగానగర్ లో చోటుచేసుకుంది. స్థానికంగా ఇంటి పనులు చేసుకుంటూ పొట్ట పోసుకుంటోన్న బధిర మహిళ అన్నమ్మ(45) తన కుమారుడు(11)తో కలసి జీవిస్తోంది. గతేడాది ఆమె భర్త చనిపోవడంతో చిన్నారితో కలసి ఒంటరిగానే అతికష్టం మీద బతుకుబండి లాగిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు రోజులుగా చిన్నారి బడికి పోకుండా, ఆకలి వేసినప్పుడు ఇరుగు పొరుగు ఇళ్లలోకి వెళ్లి కాసింత తినేసి వచ్చేస్తున్నాడు. అమ్మ నిద్రపోతోంది అని భావించి ఆమె పక్కనే పడుకుంటున్నాడు. అయితే ఫిబ్రవరి 28న తల్లి ముక్కులోనుంచి, నోట్లో నుంచి రసి కారడంతో ఇరుగు పొరుగుకు పరిస్థితి వివరించాడు. ఇది గమనించిన స్థానికులు ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆరోగ్య సమస్యల వల్లే అన్నమ్మ చనిపోయి ఉంటుందని భావిస్తున్నారు. అసహజ మరణంగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ కు పంపారు. దీనికి సంబంధించిన నివేదిక వస్తేగానీ అన్నమ్మ మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. మరోవైపు చిన్నారి పరిస్థితిపై స్థానికులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. బాబును షెల్టర్ హోమ్ కు తరలించే అవకాశం ఉందని తెలుస్తోంది.