ప్రతీకాత్మక చిత్రం
దేశ రాజధాని సరిహద్దుల్లో రైతుల ఆందోళన 12వ రోజు కొనసాగుతోంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రైతులు ఆందోళన చేస్తున్న ప్రాంతాన్ని సందర్శించారు. రైతులు రాత్రిళ్లు రోడ్డుపైనే నిద్రపోయి నిరసన చేస్తుండడంతో.. వారికి ఎలాంటి వసతులు ఉన్నాయో పర్యవేక్షించారు. సీఎంతో పాటు మంత్రులు కూడా రైతులను పరామర్శించారు. మరోవైపు వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుండడంతో ఢిల్లీ ప్రభుత్వం ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించే ఏర్పాట్లు చేసింది. ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే మద్దతు ప్రకటించినట్లు అకాళీదల్ తెలిపింది.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు వివిధ వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. అన్నదాతలకు సంఘీభావంగా సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ ఉత్తర ప్రదేశ్‌లో నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దుష్యంత్ కూడా రైతులకు బాసటగా నిలిచారు. కేంద్రం తెచ్చిన నూతన చట్టాలు రాజ్యాంగ వ్యతిరేకమని, వ్యవసాయ చట్టాల్ని సవాల్ చేస్తూ రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఉచితంగా న్యాయ సేవలు అందిస్తానని తెలిపారు. హరియాణాలో బీజేపీతో కూడిన అధికార కూటమిలోని JJPకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు రైతులకు మద్దతుగా నిలిచారు. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా ప్రపంచవ్యాప్తంగా వివిధ నగరాల్లో సంఘీభావ కార్యక్రమాలు చేపట్టారు. లండన్‌లో ప్రవాస భారతీయుల్లోని కొన్ని వర్గాలు వాహన ర్యాలీ చేపట్టాయి.
మంగళవారం భారత్ బంద్ నేపథ్యంలో నోయిడాలోని గౌతమబుద్ధ నగర్ పరిపాలనా అధికారులు 144 సెక్షన్ విధించారు. అయితే, కరోనా కట్టడి కోసమే 144 సెక్షన్ అమలు చేస్తున్నామని, జనవరి 2వ తేదీ వరకు కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. భారత్ బంద్‌కు 18 రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు మద్దతిచ్చాయి.