మమతా బెనర్జీపై పోటీకి ప్రియాంక టిబ్రేవాల్.. అసలు ఎవరీమే..?

ఇప్పుడు అందరి చూపు సెప్టెంబర్ 30న పశ్చిమ బెంగాల్‌లోని భవానీపూర్ లో జరగనున్న ఉపఎన్నిక పైన పడింది.

Update: 2021-09-10 10:17 GMT

ఇప్పుడు అందరి చూపు సెప్టెంబర్ 30న పశ్చిమ బెంగాల్‌లోని భవానీపూర్ లో జరగనున్న ఉపఎన్నిక పైన పడింది. ఈ ఉపఎన్నికకు తమ అభ్యర్ధిని ప్రకటించింది బీజేపీ. బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపై బీజేపీ తరపున ప్రియాంక టిబ్రేవాల్ పోటీ చేయనున్నారు. 41 ఏళ్ల ప్రియాంక టిబ్రేవాల్ ఓ న్యాయవాది. ఆమె కలకత్తా విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రాన్ని అభ్యసించింది. అంతేకాకుండా థాయిలాండ్‌లోని అజంప్షన్ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కూడా చేసింది. ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి ఆంగ్లంలో బీఏ కూడా చేసింది.

2014లో బీజేపీలో చేరిన ఆమె.. ప్రస్తుతం బీజేపీ యువజన విభాగం యువమోర్చాలో ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. ఎంపీ బాబుల్ సుప్రియో దగ్గర న్యాయ సలహాదారుగా ఉన్న ఆమెను ఆయన పార్టీలోకి తీసుకువచ్చారు. ఈ ఏడాది ప్రారంభంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంక టిబ్రేవాల్ బిజెపి టికెట్‌పై ఎంటల్లీ సీటు నుండి పోటీ చేసి.. టీఎంసీ అభ్యర్ధి స్వర్ణ కమల్ సాహా చేతిలో 58,257 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాగా ఈ ఎన్నికల్లో నందిగ్రామ్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి సువేందు అధికారి పై 1,956 ఓట్ల తేడాతో మమతా బెనర్జీ ఓడిపోయారు.

ఐనప్పటికీ ఆమె ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించారు. సీఎం పగ్గాలు చేపట్టిన మమత బెనర్జీ ఆరు నెలల్లోగా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంది. ఈ క్రమంలో భవానీపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన టీఎంసీ ఎమ్మెల్యే సోభాందేవ్ ఛటోపాధ్యాయ రాజీనామా చేయడంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యం అయింది. భవానీపూర్ తో పాటుగా శంషేర్ గంజ్, జంగీపూర్ స్థానాలకు కూడా సెప్టెంబర్ 30న ఉప ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి.

Tags:    

Similar News