PM Modi : మోదీ కాన్వాయ్‌ను అడ్డుకున్నది మేమే : బీకేయూ ప్రకటన
PM Modi : ప్రధాని మోదీ 20 నిమిషాల పాటు ఫ్లైఓవర్ పైనే నిలిచిపోవడం భద్రతా వైఫల్యమేనా? సెంట్రల్ ఏజెన్సీల వైఫల్యమా లేక పంజాబ్ పోలీసుల వైఫల్యమా?;
PM Modi : ప్రధాని మోదీ 20 నిమిషాల పాటు ఫ్లైఓవర్ పైనే నిలిచిపోవడం భద్రతా వైఫల్యమేనా? సెంట్రల్ ఏజెన్సీల వైఫల్యమా లేక పంజాబ్ పోలీసుల వైఫల్యమా? అసలు ప్రధాని రూట్ మ్యాప్ సడెన్‌గా మారినప్పుడు రైతులు అక్కడికి ఎలా వచ్చారు? ఈ అంశాలపైనే దర్యాప్తు జరుగుతోంది. నిజానికి ప్రధాని పర్యటన అనగానే సెంట్రల్ ఫోర్స్ దిగుతాయి. సెక్యూరిటీ అరేంజ్‌మెంట్స్ మొత్తం వాళ్ల చేతిలోకే వెళ్లిపోతాయి. అయినా సరే.. ప్రధాని కాన్వాయ్ 20 నిమిషాల పాటు ఆగిపోయింది. దీనిపై అటు కేంద్ర హోంశాఖ, ఇటు పంజాబ్ ప్రభుత్వం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.
మోదీ కాన్వాయ్‌ను అడ్డుకున్నది తామేనంటూ ప్రకటించింది భారతీయ కిసాన్ యూనియన్. ప్రధాని పర్యటనపై నిరసన తెలిపేందుకే పియారియానా గ్రామ సమీపంలో ఫ్లైఓవర్‌కు వచ్చినట్టు తెలిపారు. డిసెంబరు 31వ తేదీన ఏడు కిసాన్ యూనియన్ల సమావేశం జరిగిందని, ప్రధాని పర్యటనలో భారీ నిరసనలు చేపట్టాలని ఆ సమయంలోనే నిర్ణయించుకున్నామని తెలిపారు.
నిజానికి ప్రధాని వెళ్తున్న రూట్‌లో ఎప్పటి నుంచో రైతులు నిరసనలు చేస్తున్నారు. ఆ విషయం రాష్ట్ర పోలీసులకు, కేంద్ర బలగాలకు సైతం తెలుసు. అయినా సరే.. అటువైపు నుంచే రూట్ మ్యాప్ ఫిక్స్ చేశారు. మరోవైపు, ఫ్లైఓవర్ దగ్గర ఉన్న రైతులు మహా అయితే వంద మంది ఉంటారు. కాని, ప్రధాని భద్రత కోసం వేల మంది పోలీసులను దింపారు. అయినప్పటికీ.. నిరసనకారులను నిలువరించడంలో భద్రతా సిబ్బంది విఫలమయ్యారు.
పంజాబ్ శాంతిభద్రతల అంశంపై ప్రధాని నరేంద్ర మోదీతోపాటు కేంద్రం హోంశాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది పంజాబ్ కాంగ్రెస్ ప్రభుత్వ సెక్యూరిటీ వైఫల్యమేనని మండిపడింది. ప్రధానిని ఫ్లైఓవర్‌పైనే 20 నిమిషాల పాటు ఆపడానికి కారణాలేంటో చెప్పాలని, పంజాబ్ సర్కార్‌కు కేంద్ర హోంశాఖ ఆదేశాలిచ్చింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అయితే.. పంజాబ్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భద్రతా లోపానికి సంబంధించి పంజాబ్ గవర్నమెంట్ సమాధానం చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు.
అయితే, పంజాబ్ ప్రభుత్వం మాత్రం ప్రధాని పర్యటనలో ఎలాంటి భద్రతా వైఫల్యాలు లేవని చెప్పుకొచ్చింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా సుమారు 10 వేల మంది భద్రతా సిబ్బందితో ఏర్పాట్లు చేశామని అడిషనల్ డీజీపీ తెలిపారు. యాంటీ డ్రోన్ బృందాన్ని కూడా మోహరించినట్లు అధికారులు చెప్పారు. పంజాబ్ పోలీసులు, NSG, ఆర్మీ, BSF సమన్వయంతో పనిచేసినా.. హై టెన్షన్ నేపథ్యంలో అక్కడికి మోడీ వెళ్లలేకపోయారన్నారు.
మరోవైపు పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ కూడా జరిగిన దానికి విచారం వ్యక్తం చేశారు. వెంటనే విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. అయితే, మోదీపై దాడి చేయాలనే ఆలోచన గాని, అలాంటి పరిస్థితులు గాని అక్కడ చోటు చేసుకోలేదని వివరణ ఇచ్చారు. ప్రధాని పర్యటనలో సడెన్‌గా రూట్‌మ్యాప్ మారిందని, ఆయన భద్రతా ఏర్పాట్లన్నీ సెంట్రల్ ఏజెన్సీల చేతుల్లోనే ఉన్నాయని గుర్తు చేశారు. ప్రధాని పర్యటనలో భద్రత కల్పించే అంశంలో పంజాబ్ పోలీసులది చాలా తక్కువ పాత్ర ఉంటుందని చెప్పుకొచ్చారు. నిజానికి, ప్రధాని ఫెరోజ్‌పూర్ పబ్లిక్ ర్యాలీలో 70వేల మంది వస్తారనే అంచనాతో బీజేపీ కుర్చీలు వేయించిందని, కాని, అక్కడ 700 మంది కూడా రాకపోవడంతోనే ప్రధాని వెనుదిరిగారని పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ విమర్శించారు.