BRS Office: హస్తినలో బీఆర్ఎస్ ఆఫీస్.. అన్ని ఏర్పాట్లు పూర్తి
BRS Office: తెలంగాణ మోడల్‌ను దేశానికి పరిచయం చేయడమే లక్ష్యంగా.. హస్తినలో రేపు భారత రాష్ట్ర సమితి ఆఫీసును ప్రారంభిస్తారు కేసీఆర్.;
BRS Office: తెలంగాణ మోడల్‌ను దేశానికి పరిచయం చేయడమే లక్ష్యంగా.. హస్తినలో రేపు భారత రాష్ట్ర సమితి ఆఫీసును ప్రారంభిస్తారు కేసీఆర్. ఢిల్లీ సర్దార్ పటేల్ మార్గ్‌లో అద్దె భవనంలో పార్టీ ఆఫీసు ఏర్పాటు చేశారు. ఇవాళ, రేపు ప్రత్యేక పూజలు యాగాలు చేయనున్నారు.
రాజశ్యామల యాగం కోసం ప్రత్యేక యాగశాల నిర్మించారు. యాగశాలలో మూడు హోమగుండాలు ఏర్పాటు చేశారు. గణపతి పూజతో యాగం ప్రారంభం కానుంది. మొత్తం 12 మంది రుత్వికుల ఆధ్వర్యంలో ఈ పూజలు జరగనున్నాయి. శృంగేరి పీఠం గోపీకృష్ణ, ఫణి శశాంక ఆధ్వర్యంలో యాగాలు జరుగుతాయి.
సర్దార్ పటేల్ మార్గ్‌లోని అద్దె భవనంలో బీఆర్ఎస్ తాత్కాలిక ఆఫీసును..బుధవారం మధ్యాహ్నం 12 గంటల 36 నిమిషాలకు కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ యువనేత తేజస్వి యాదవ్, రైతు నాయకుడు రాకేష్ టికాయత్ సహా పలు రైతు సంఘాల నేతలు హాజరుకానున్నారు.
వాస్తుకు అనుగుణంగా సుద్దాల సుధాకర్ తేజ సూచనల ప్రకారం ఆఫీసు బిల్డింగ్‌లో మార్పులు, చేర్పులు, మరమ్మతు పనులు చేపట్టారు. ఆఫీసు ప్రారంభోత్సవ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు. తెలంగాణ నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కార్పొరేషన్ల ఛైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఇప్పటికే ఢిల్లీ బయల్దేరి వెళ్లారు.
మరోవైపు ఢిల్లీలో కేసీఆర్ ఫర్ ఇండియా, దేశ్ కీ నేత, కిసాన్ కి భరోసా, అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదాలతో హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సీఎం ఢిల్లీ పర్యటన ఐదు రోజుల పాటు సాగనుంది. ఈ నెల 18న హైదరాబాద్‌కు తిరిగివస్తారని సమాచారం. ఇతర రాష్ట్రాల్లో కూడా బీఆర్ఎస్ ఆఫీసులు ఏర్పాటు చేయనున్నట్లు పార్టీ నాయకుల ద్వారా తెలిసింది.