Central Government : ధాన్యం కొనుగోళ్లపై స్పందించిన కేంద్రం
Central Government : ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పష్టత నిచ్చింది. తెలంగాణ వడ్లు కొంటారా? కొనరా? సూటిగా చెప్పండంటూ ప్రధానికి కేసీఆర్ రాసిన లేఖకు కేంద్రం స్పందించింది.;
Central Government : ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పష్టత నిచ్చింది. తెలంగాణ వడ్లు కొంటారా? కొనరా? సూటిగా చెప్పండంటూ ప్రధానికి కేసీఆర్ రాసిన లేఖకు కేంద్రం స్పందించింది. పారాబాయిల్డ్ రైస్ కొనసోమని స్పష్టం చేసింది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు కేంద్ర మంత్రి పియూష్ గోయల్ లేఖ రాశారు. ఇక మీదట పారాబాయిల్డ్ రైస్ సేకరణ కుదరదని తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేశామని, దానికి కేసీఆర్ కూడా అంగీకరించారని గోయల్ పేర్కొన్నారు. యాసంగి పంట కూడా పరిమితంగానే కొంటామని కేంద్రం ప్రకటించింది.
ఈ ఖరీఫ్ సీజన్లో 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించేందుకు ఇప్పటికే అంగీకారం తెలిపామని, రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కోటా మరింత పెంచే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు లేఖలో కేంద్ర మంత్రి పియూష్ గోయల్ పేర్కొన్నారు. గత రబీ సీజన్లో పండిన పారా బాయిల్డ్ రైస్ 44.7 లక్షల మెట్రిక్ టన్నుల వరకు కొంటామని చెప్పామని, అందులో ఇంకా మిగిలి ఉన్న పారా బాయిల్డ్ రైస్ సేకరణ కొనసాగుతోందన్నారు.
దేశంలో పారా బాయిల్డ్ రైస్ కి డిమాండ్ లేదని, ఈ తరహా రైస్‌ను వినియోగించే రాష్ట్రాలు స్వయంగా సమకూర్చుకుంటున్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా వరి, గోధుమ పంటల దిగుబడి దేశీయ అవసరాలకు మించి జరుగుతోందని, అలాగే గోధుమ పండించే చాలా రాష్ట్రాల్లో వరి కూడా సాగు చేస్తున్నారని గుర్తుచేశారు. పంజాబ్ రాష్ట్రంలో వరి పండించినంతగా వినియోగం ఉండదు కనుకే అక్కడ 90శాతం సేకరణకు కారణమని కేంద్రం తెలిపింది.
తదుపరి రబీ సీజన్లో ఎంత కొంటామనేది రాష్ట్రాలతో సమావేశం జరిపి, దిగుబడి అంచనాలను చూసి నిర్ణయం తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేసింది.