చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు చేపట్టనున్న రెండో తెలుగు వ్యక్తి జస్టిస్ ఎన్వీ రమణ
సుప్రీం కోర్టు 48వ సీజేగా జస్టిస్ రమణ పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే ప్రతిపాదించారు.;
భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ నియమితులు కానున్నారు. సుప్రీం కోర్టు 48వ సీజేగా జస్టిస్ రమణ పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే ప్రతిపాదించారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖకు లేఖ రాశారు. జస్టిస్ బోబ్డే ఏప్రిల్ 23న పదవీ విరమణ చేయనున్నారు. ఏప్రిల్ 24న జస్టిస్ ఎన్వీ రమణ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఆయన 2022, ఆగస్టు 26 వరకు ఆ పదవిలో కొనసాగుతారు.
వ్యవసాయ నేపథ్య కుటుంబం నుంచి వచ్చిన జస్టిస్ ఎన్వీ రమణ.. దేశంలో అత్యున్నత పదవిని అలంకరించనున్నారు. జూన్ 2000 సంవత్సరంలో ఏపీ హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ ఎన్వీ రమణ.. 2014లో ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పని చేశారు.
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు చేపట్టబోతున్న రెండో తెలుగు వ్యక్తి జస్టిస్ NV రమణ.. గతంలో 1966-67 మధ్యకాలంలో జస్టిస్ కోకా సుబ్బారావు CJIగా పనిచేశారు.. 1966 జూన్ 30 నుంచి 1967 ఏప్రిల్ 11 వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కోకా సుబ్బారావు పనిచేశారు.. ఆయన తర్వాత రెండో తెలుగు వ్యక్తి ఎన్వీ రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.
జస్టిస్ రంజన్ గొగోయ్ రిటైర్మెంట్ తర్వాత ఆయన స్థానంలో SA బోబ్డే బాధ్యతలు చేపడితే ఇప్పుడు ఆయన తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా జస్టిస్ NV రమణ నియమితులు అవుతున్నారు. దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన అనేక ముఖ్యమైన కేసుల్లో NV రమణ చారిత్రక తీర్పులు ఇచ్చారు. ఇప్పుడు ఆయన అత్యున్నత పదవిని అలంకరిస్తుండడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.