చైనా నుంచి మరో కొత్త వైరస్ 'మంకీ బీ'..
రెండు చనిపోయిన కోతులను తాకడం ద్వారా ఆయనకు ఈ వైరస్ సోకినట్లు తెలిసింది;
కరోనా వైరస్ తీవ్రత తగ్గనేలేదు. మళ్లీ ఇంకో వైరస్సా మన ప్రాణాలు తీయడానికి. చైనాలో ఈ మంకి బీ వైరస్ కారణంగా ఓ మరణం కూడా సంభవించిందట. 53 ఏళ్ల వెటర్నరీ డాక్టర్ ఈ వైరస్ బారిన పడి మృత్యువాత పడ్డారు. ఈ ఏడాది మార్చిలో రెండు చనిపోయిన కోతులను తాకడం ద్వారా ఆయనకు ఈ వైరస్ సోకినట్లు తెలిసింది. దాదాపు నెల రోజుల తరువాత ఆయనకు కడుపులో వికారం, వాంతులు మొదలయ్యాయి. దాంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన మే 27న మృతి చెందారు.
అయితే ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిన వైరస్ కాదు 1933లోనే ఓ లేబరేటరీలో పని చేసే వ్యక్తి ఈ వైరస్ కారణంగా చనిపోయారని చెబుతున్నారు నిపుణులు. అతడిని ఓ కోతి కరిచింది. కొన్ని రోజులు జ్వరంతో బాధపడ్డారు. అనంతరం నాడీ సంబంధిత సమస్యలతో బాధపడి 15 రోజులకే మృత్యువాత పడ్డారు.
ఇది మనిషి నుంచి మనిషికి నేరుగా వ్యాపిస్తుంది. వైరస్ సోకిన వ్యక్తి స్రవాలు మరో వ్యక్తికి వెళ్లడం ద్వారా ఈ వ్యాధి సోకుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ వైరస్ బారిన పడి 20 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో ఐదురుగు గత 12 ఏళ్లలోనే చనిపోయారు. చాలా మందికి కోతి కరవడం, లేదా గీరడం ద్వారానే కోతి కణజాలం శరీరంలోకి వెళ్లడం ద్వారా వైరస్ బారిన పడ్డారు.
ఇది మనిషికి సోకినప్పుడు ప్రధానంగా కేంద్ర నాడీ వ్యవస్థపైన దాడి చేస్తుందని అమెరికాకు చెందిన నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ వెల్లడించింది. దీని బారిన పడిన వారిలో 70 నుంచి 80 శాతం మంది మరణించారు.
వైరస్ సోకిన తర్వాత 1-3 వారాల్లోపు లక్షణాలు కనిపిస్తాయి. వీటిలో ప్రధానంగా ఫ్లు వైరస్ లక్షణాలైన జ్వరం, చలి, కండరాల నొప్పి, అలసట, తలనొప్పి కనిపిస్తాయి.
మహమ్మారిగా మారే అవకాశాలు చాలా తక్కువ అని ఈ వైరస్‌పై జరిపిన పరిశోధనలు తేల్చాయి. ఒక మనిషి నుంచి మరో మనిషికి అంత సులువుగా ఇది సోకదు. ఈ కారణంగా దీని వ్యాప్తి వేగం తక్కువే. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు వివరిస్తున్నారు.