గాయపడిన పులి మరింత ప్రమాదకరం : మమతా బెనర్జీ

తన కాలికి అయిన గాయాన్ని ఉద్దేశిస్తూ గాయపడిన పులి మరింత ప్రమాదకరమని మమతా అన్నారు.

Update: 2021-03-15 04:00 GMT

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కాలికి గాయం తర్వాత ముఖ్యమంత్రి మమత తొలిసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వీల్ ఛైర్ లోనే రోడ్ షో నిర్వహించారు. వేలాదిమంది కార్యకర్తలు వెంటరాగా.. వీల్ చైర్‌లోనే ప్రచారాన్ని కొనసాగించారు. కోల్‌కతలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద రోడ్ షో ప్రారంభించారు.

కాలికి గాయం కావడం వల్ల ఆసుపత్రిలో అడ్మిట్ అయిన తరువాత.. మమతా బెనర్జీ పాల్గొన్న తొలి రోడ్ షో ఇదే. మహాత్మాగాంధీ విగ్రహం నుంచి హజ్రా వరకు ఆమె ర్యాలీగా తరలి వెళ్లారు. రోడ్ షో అనంతరం హజ్రాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో దీదీ పాల్గొన్నారు. తన జీవితంలో ఎన్నో దాడులు ఎదుర్కొన్నానని, అయితే, ఎవరికీ తలొగ్గలేదని మమతా బెనర్జీ అన్నారు. తన కాలికి అయిన గాయాన్ని ఉద్దేశిస్తూ గాయపడిన పులి మరింత ప్రమాదకరమని అన్నారు. వీల్‌ ఛైర్‌లోనే తన ప్రచారాన్ని కొననసాగిస్తానని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.

మరోవైపు సానుభూతి కోసమే మమత డ్రామాలాడుతున్నారని బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తిరిగి తమపైనే ఆరోపణలు చేయడం సిగ్గు చేటంటూ మండిపడుతున్నారు. అయితే, ఆమెపై ఎలాంటి దాడి జరగలేదని.. ప్రమాదవశాత్తు ఆ ఘటన జరిగిందని ఎన్నికల సంఘం పేర్కొంది.

మరోవైపు మమతకు భద్రత కల్పించడంలో వైఫల్యం చెందారన్న ఆరోపణలపై ఆమె సెక్యూరిటీ అధికారి వివేక్ సహాయ్‌పై వేటు పడింది. జడ్‌ ప్లస్‌ భద్రత కలిగిన వ్యక్తికి రక్షణ కల్పించడంలో విఫలమయ్యారంటూ వివేక్ సహాయ్‌పై చర్యలు తీసుకుంది ఈసీ.. తక్షణమే ఆయన్ను సస్పెండ్‌ చేయాలని సీఎస్‌కు ఆదేశాలిచ్చింది. సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుందని ఈసీ స్పష్టం చేసింది.

వారం రోజుల్లోగా సహాయ్ పై అభియోగాలను నమోదు చేయాలని సూచించింది. సహాయ్‌తోపాటు మేదినీపూర్‌ ఎస్పీ ప్రవీణ్‌ ప్రకాశ్‌ను సైతం ఈసీ సస్పెండ్‌ చేసింది. మమతకు తగిన భద్రతా ఏర్పాట్లు చేయడంలో ఆయన విఫలమయ్యారని పేర్కొంది. అలాగే తూర్పు మిడ్నాపూర్‌ డిస్ట్రిక్ట్‌ మేజిస్ట్రేట్‌ విభు గోయల్‌ను బదిలీ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. నందిగ్రామ్‌ ఘటనపై 15 రోజుల్లోగా పోలీసు విచారణ పూర్తి కావాలని.. ఈ నెల 31 కల్లా నివేదిక సమర్పించాలని అధికారులకు ఈసీ సూచించింది.

Tags:    

Similar News