Congress President Poll : 24 ఏళ్ల తరువాత జరుగుతోన్న అధ్యక్ష ఎన్నికలు.. ఓటు వేసిన రాహుల్..

Congress President Poll : ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నికకు పోలింగ్‌ మొదలైంది. దాదాపు 24 ఏళ్ల తరువాత జరుగుతోన్న పార్టీ అధ్యక్ష ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పార్టీ ఎన్నికల విభాగం తెలిపింది.;

Update: 2022-10-17 07:43 GMT

Congress President Poll : ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నికకు పోలింగ్‌ మొదలైంది. దాదాపు 24 ఏళ్ల తరువాత జరుగుతోన్న పార్టీ అధ్యక్ష ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పార్టీ ఎన్నికల విభాగం తెలిపింది. పోలింగ్‌లో సభ్యులకు కీలక సూచనలు చేసింది.


బ్యాలెట్ పేపర్లలో అభ్యర్థి పేరు ముందు 1 లేదా 2 అనే అంకెలకు బదులు టిక్ మార్క్ చేయాలని సూచించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ఇప్పటికే అన్ని రాష్ట్రాల పీసీసీ సభ్యులకు చేరవేశామని తెలిపింది. కాగా, రహస్య బ్యాలెట్ ద్వారా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక జరగనుంది. ఏ అభ్యర్థికి ఎవరు ఓటు వేశారనే విషయం తెలుసుకోవడం సాధ్యం కాదు.

రెండు దశాబ్దాల తర్వాత జరుగుతున్న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో ఈసారి గాంధీ కుటుంబేతర వ్యక్తులు పోటీ ఉండటంతో ఇంట్రెస్ట్రింగ్‌ గా మారింది. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఆ పార్టీ సీనియర్ నేతలు మల్లిఖార్జున ఖర్గే, శశిథరూర్ పోటీ పడుతున్నారు.ఉదయం పదిగంటలకు పోలింగ్ మొదలై, సాయంత్రం నాలుగు గంటల వరకు జరగనుంది.

పోలింగ్ ఏజెంట్లు, రిటర్నింగ్ అధికారి పార్టీ జారీ చేసిన క్యూఆర్ కోడ్‌తో కూడిన గుర్తింపు కార్డుతో ఉదయం 8.30కే పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఓటు వేసే అభ్యర్థులు బ్యాలెట్ పేపర్లలో అభ్యర్థి పేరు పక్కన టిక్ మార్క్ పెట్టాల్సి ఉంటుందని కాంగ్రెస్ సెంట్రల్‌ ఎలక్షన్‌ అథారిటీ చీఫ్ మధుసూదన్ మిస్త్రీ క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ ఎన్నికల్లో మొత్తం 9100 మందికిపైగా సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇవాళ పోలింగ్‌ జరుగుతుండగా బుధవారం కౌంటింగ్‌ అనంతరం ఫలితాలు ప్రకటించనున్నారు.

ఏఐసీసీ ప్రధాన కార్యాలయం సహా దేశవ్యాప్తంగా 65 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 137 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ పార్టీలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతుండడం ఇది ఆరోసారి. పార్టీ చీఫ్‌ సోనియా గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో.. జోడో యాత్రలో ఉన్న రాహుల్‌గాంధీ కర్ణాటకలోని బళ్లారిలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మరో 40 మంది ప్రతినిధులు ఇక్కడే ఓటు వేయనున్నారు.

ఇక అధ్యక్ష రేసులో ఉన్న 66 ఏళ్ల శశి థరూర్‌కు యువ నాయకులు కలిసివచ్చే అవకాశం ఉంది. ఆయన ఎక్కడ ప్రచారం నిర్వహించినా.. యువ నాయకత్వం ఆయనకు స్వాగతం పలకడం.. ఆయనతో కలిసి చర్చించడం వంటివి.. యువత తనకు మద్దతిస్తుందని థరూర్‌ వర్గం భావిస్తుండగా..కర్ణాటకకు చెందిన 80 ఏళ్ల ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మల్లికార్జున ఖర్గేకు గాంధీ కుటుంబం సహా సీనియర్‌ నేతలు మద్దతిస్తున్నారు.


సుదీర్ఘ రాజకీయ అనుభవం, ఇతర పార్టీ నేతలతో స్నేహ సంబంధాలు ఆయనకు కలిసివచ్చే అంశాలు.గాంధీ కుటుంబం, సీనియర్‌ నేతలు మల్లికార్జున ఖర్గే వైపే మొగ్గుచూపుతున్నట్టు సంకేతాలు అందుతుండడంతో థరూర్‌ కూడా ఖర్గేతో కలిసి పనిచేసేందుకు తాను సిద్ధమేనని, కాంగ్రెస్‌ బలోపేతానికి కృషి చేస్తానని స్టేట్‌మెంట్‌ ఇచ్చేశారు.

మరోవైపు భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీతో పాటు పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు రాహుల్‌తో ఉండటంతో ప్రత్యేకంగా ఒక బూత్‌ను జోడో యాత్ర క్యాంపులో ఏర్పాటు చేశారు. మిగతా బూత్‌లను ఆయా రాష్ట్రాల పీసీసీ కార్యాలయాల్లో, ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేశారు.


ప్రతి రాష్ట్రానికి ఒక రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిని పార్టీ నియమించిందిఏఐసీసీ. తెలంగాణ రిటర్నింగ్ అధికారిగా కేరళకు చెందిన రాజమోహన్ ఉన్నితన్‌ను నియమించగా, ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి రిటర్నింగ్ అధికారిగా తెలంగాణకు చెందిన పొన్నం ప్రభాకర్‌ను పార్టీ నియమించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలను రిటర్నింగ్ అధికారులుగా నియమించింది.

Tags:    

Similar News