Constitution Day: ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు..
Constitution Day: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా పార్లమెంట్ సెంట్రల్‌హాల్‌లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను నిర్వహించారు.;
Constitution Day (tv5news.in)
Constitution Day: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా పార్లమెంట్ సెంట్రల్‌హాల్‌లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్రమంత్రులు, పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
రాజ్యాంగ దినోత్సవాన్ని తెరపైకి తెచ్చిన మోదీ ప్రభుత్వం.. నవంబర్26ను సంవిధాన్ దివస్‌గా పాటిస్తోంది. ఈ సందర్భంగా రాజ్యాంగ సభ చర్చల డిజిటల్ వెర్షన్లు, ఇప్పటి వరకు చేసిన సవరణలతో కూడిన భారత రాజ్యాంగం నగీషీ వ్రాత ప్రతిని రాష్ట్రపతి విడుదల చేశారు. రాజ్యాంగం భారతీయులందరినీ కలుపుతుందని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు.
రాజ్యాంగ పటిష్టతతో దేశ అభివృద్ధి ప్రయాణం సాగుతుందన్నారు. రాజ్యాంగ నిర్మాణంలో మహిళలు కూడా అపూర్వమైన కృషి చేశారని రాష్ట్రపతి అన్నారు. భారతదేశం ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఉండాలని రాజ్యాంగం ఆశిస్తోందని, ఆ ఆశయాలను సజీవంగా ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని అన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. దేశ అభివృద్ధికి ప్రజలే కేంద్రంగా ఉన్నారనేది మన దృఢ విశ్వాసమన్నారు.
విభిన్నమైన మన దేశాన్ని.. మన రాజ్యాంగం ఏకీకృతం చేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. రాజ్యాంగ దినోత్సవం రోజున మన పార్లమెంట్‌కు సెల్యూట్ చేయాలన్నారు. 1950 తర్వాత ప్రతి ఏడాది రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించాల్సి ఉన్నా.. కొందరు అలా వ్యవహరించలేదన్నారు. రాజ్యాంగ నిర్మాణంపై ప్రజలను చైతన్యపరచాల్సిన అవసరం ఉందని ప్రధాని పేర్కొన్నారు. పరోక్షంగా కాంగ్రెస్‌ను ప్రస్తావిస్తూ.. ఒక పార్టీని అనేక తరాలుగా ఒకే కుటుంబం నడుపుతుంటే, అది ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ప్రధాని హెచ్చరించారు.
భారత రాజ్యాంగంను ఆధునిక భగవద్గీతగా అభివర్ణించారు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా. దేశం పట్ల మన కర్తవ్యాన్ని నిర్వర్తించేందుకు రాజ్యాంగం మనల్ని ప్రేరేపిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ దేశం కోసం పనిచేస్తే.. ఏక్ భారత్, శ్రేష్ట భారత్ నిర్మించవచ్చన్నారు. రాజ్యాంగ దినోత్సవ వేడుకలకు విపక్షాలు డుమ్మా కొట్టాయి. కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, ఎన్సీపీ, ఆర్జేడీ, శివసేన, లెఫ్ట్ పార్టీలు బాయ్‌కాట్ చేశాయి.