కరోనా కేసులలో భారత్ కొత్త రికార్డులు నమోదు
భారత్‌లో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య కోటీ 28 లక్షలకు చేరింది. గడచిన 24 గంటల్లో 630 మంది చనిపోయారు.;
కరోనా కేసుల విషయంలో భారత్ కొత్త రికార్డులు నమోదు చేసింది. గడచిన 24 గంటల్లో ఒక లక్షా 15వేల 735 మందికి పాజిటివ్ వచ్చింది. ఒక రోజులో లక్షా మూడువేలకు పైగా కేసులు నమోదవడమే ఇప్పటి వరకున్న రికార్డ్. ఇప్పడు దాన్ని చెరిపేస్తూ కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక మీదట రోజుకు లక్షకు పైగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతాయని చెబుతున్నారు. వచ్చే వారం పది రోజుల్లో కరోనా కేసులు భీకరంగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ రెండో వారంలోపు దేశంలో పాతిక లక్షల కరోనా కేసులు నమోదవుతాయని ఓ అంచనా. అంటే, ఏప్రిల్ మొదలైనప్పటి నుంచి.. వచ్చే పది రోజుల వరకు.. ఈ గ్యాప్‌లోనే 25 లక్షల కేసులు రికార్డ్ అవుతాయని ముందుగానే అంచనా వేశారు. దానికి తగ్గట్టే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది.
భారత్‌లో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య కోటీ 28 లక్షలకు చేరింది. గడచిన 24 గంటల్లో 630 మంది చనిపోయారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య లక్షా 66వేల 177కి పెరిగింది. దేశంలో ప్రస్తుతం 8 లక్షల 43వేల 473 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు రికవరీ రేటు కూడా పడిపోతుండడంతో రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన ఆంక్షలకు దిగుతున్నాయి. ఇప్పటికే, చాలా రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూ, వీకెండ్ లాక్‌డౌన్‌లు అమల్లోకి వచ్చాయి. కొన్ని గ్రామాల్లో అయితే ప్రజలే స్వచ్ఛందంగా లాక్‌డౌన్ ప్రకటించుకున్నారు. మే, జూన్ నెలలో ఊహించనంత స్థాయిలో కరోనా కేసులు నమోదవుతాయనే అంచనాలు కూడా ఉన్నాయి.