మహారాష్ట్ర, కేరళలో రెండు రకాల వైరస్‌లు.. తెలంగాణలోనూ కలవరపెడుతున్న కరోనా
ఈ రెండు రకాల్లో ఒకదాని జాడ తెలంగాణలోనూ కనిపించిందని కేంద్రం చెప్పడం మరింత కలవరం రేపుతోంది.;
దేశాన్ని కరోనా మహమ్మారి మరోసారి కలవరపెడుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. మళ్లీ రాష్ట్ర సరిహద్దుల వెంట నిబంధనలు కఠినతరం చేస్తున్నాయి. లాక్‌డౌన్ విధించేందుకు సైతం సిద్ధమవుతున్నాయి. కేసులు ఒక్కసారిగా పెరుగుతుండడం, కరోనా కొత్త స్ట్రెయిన్ వైరస్ బయటపడడంతో కేంద్రం కూడా ఉలిక్కి పడింది. వెంటనే ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది.
సార్స్-కోవ్-2 వైరస్‌కు సంబంధించి N440K, E484K రకాలను దేశంలోని మహారాష్ట్ర, కేరళలో గుర్తించినట్లు కేంద్రం స్వయంగా ప్రకటించింది. ఈ రెండు రకాల్లో ఒకదాని జాడ తెలంగాణలోనూ కనిపించిందని కేంద్రం చెప్పడం మరింత కలవరం రేపుతోంది. బ్రిటన్ రకం వైరస్ కనిపించిన తర్వాత భారత ప్రభుత్వం విభిన్న విభాగాలకు చెందిన పది ప్రయోగశాలలను జోడించి కన్సార్షియం ఏర్పాటుచేసింది. ఇప్పటివరకు 3వేల 500 వైరస్‌ల జన్యుపరిణామ క్రమాలను విశ్లేషించింది. అందులో 187 మందిలో బ్రిటన్, ఆరుగురిలో దక్షిణాఫ్రికా, ఒక వ్యక్తికి బ్రెజిల్ రకం వైరస్ సోకినట్లు తేలింది. జన్యుపరిణామక్రమాన్ని గుర్తించేటప్పుడు కేవలం ఈ మూడు రకాల వైరస్‌ల పరిశీలనకే పరిమితం అవకుండా, వైరస్‌లో ఇంకా ఏమైనా మార్పులు వచ్చాయేమోనని నిరంతరం పరిశీలిస్తున్నారు. అనుకున్నట్టే మరికొన్ని రకాల మార్పులు కనిపించాయి.
దేశంలో ఏడాదిలో ఏడు వేల కరోనా స్ట్రెయిన్‌లలో 24 వేల పైగా మార్పులను గుర్తించారు. వీటిలో చాలావరకు తీవ్ర ప్రమాదకారులని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. వీటిలో N440K ఉత్పరివర్తనం దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా వ్యాపిస్తోందని తెలిపారు. ఈ 7వేల కరోనా స్ట్రెయిన్‌లు ప్రస్తుతం వ్యాప్తి చెందుతూనే ఉన్నట్లు కరోనాపై ఏర్పాటైన జాతీయ టాస్క్‌ఫోర్స్ తెలిపింది. అందుకే, మాస్క్, భౌతికదూరం తప్పదని హెచ్చరిస్తున్నారు.
కేరళ నుంచి కర్నాటకలోకి ప్రవేశించేవారిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కర్నాటకలో కొత్తరకం స్ట్రెయిన్ ప్రవేశించకుండా కర్నాటక ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేరళ నుంచి కర్నాటక వచ్చేవారు గత 72 గంటల్లో చేయించుకున్న ఆర్‌టీ-పీసీఆర్ పరీక్ష నెగెటివ్ రిపోర్ట్ ఉండడాన్ని తప్పనిసరి చేశారు. ఇటు నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని సాలూర, ఖండ్‌గావ్ చెక్‌పోస్ట్ వద్ద మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనాలను తనిఖీ చేస్తూ ప్రయాణికులకు మాస్కులు, శానిటేషన్ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. సోమవారం నుంచి బస్సుల్లో, ఇతర వాహనాల్లో వచ్చిన వారికి స్క్రీనింగ్ టెస్టులు చేశారు. నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు పక్బందీగా చెక్‌పోస్ట్‌ల వద్ద మహారాష్ట్ర నుంచి వచ్చే వారికి స్క్రీనింగ్, కరోనా పరీక్షలు చేశారు. బోధన్ మండలంలోని హెల్త్ సూపర్‌వైజర్ ఆధ్వర్యంలో రెండు టీంలను ఏర్పాటు చేసి సాలూర, ఖండ్‌గావ్ చెక్‌పోస్ట్‌ల వద్ద తనిఖీ, పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.