దేశంలో స్ట్రెయిన్ వైరస్ కలవరం.. తెలంగాణలో అంత్యక్రియల్లో పాల్గొన్న 22 మందికి కరోనా
యూకే వైరస్ సాధారణం కంటే 70 శాతం వేగంగా విస్తరిస్తోందని వైద్యాధికారులు చెబుతున్నారు.;
కరోనా తగ్గుముఖం పట్టిన సమయంలో స్ట్రెయిన్ వ్యాప్తి కలవరపెడుతోంది. కొత్త రకం వైరస్‌తో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కొత్తగా మరో నాలుగు కేసులను అధికారులు నిర్ధారించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 29కి పెరిగింది. బ్రిటన్‌లో స్ట్రెయిన్ ప్రబలడంతో వెంటనే అలర్టైన భారత్.. ఆ దేశం నుంచి నవంబర్ 25 నుంచి డిసెంబర్ 23 మధ్య 33వేల మంది వచ్చినట్టు గుర్తించింది. వారికి ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించగా.. కొందరికి కరోనా పాజిటివ్‌గా అని నిర్ధారణ అయ్యింది. వీరిలో కొత్త రకం కరోనా ఇప్పటివరకు 29 మంది ఉన్నట్టు పరీక్షల్లో తేలింది.
తాజాగా నమోదైన కేసుల్లో మూడు కేసులు బెంగళూరులోనే ఉన్నాయి. ఇక మరో కేసు హైదరాబాద్‌లో నమోదైనట్టు తెలిసింది. ఇప్పటి వరకు భారత్‌లో నమోదైన యూకే కరోనా స్ట్రెయిన్ కేసుల్లో ఢిల్లీలో 10 శాంపిల్స్, బెంగళూరులో 10 శాంపిల్స్, హైదరాబాద్‌లో 3, పశ్చిమ బెంగాల్లో 1, పూణేలో మరో ఐదు శాంపిల్స్ టెస్ట్ చేశారు. మొత్తం 29 మంది బాధితులను ఐసోలేషన్‌లో ఉంచారు. యూకే వైరస్ సాధారణం కంటే 70 శాతం వేగంగా విస్తరిస్తోందని వైద్యాధికారులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో కొత్త వైరస్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
సూర్యాపేటలో ఓ గేటెడ్ కమ్యూనిటీలోని ఇంట్లో ఓ వ్యక్తి చనిపోతే.. అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో బంధువులు హాజరయ్యారు. అయితే వారిలో 22 మందికి కరోనా సోకింది. దీంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న ఆరోగ్య శాఖ అధికారులు ముందు జాగ్రత చర్యగా కాలనీ మొత్తం ఆరోగ్య సర్వే చేపట్టారు. ప్రస్తుతం బాధితులంతా హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎంత ప్రమాదమో అర్ధమవుతోంది.
కరోనా ముప్పు ఇంకా పొంచి ఉందనే విషయాన్ని ఈ ఘటన గుర్తు చేస్తోంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ వైద్యాధికారులు కోరుతున్నారు.